రూ.912.84 కోట్లతో పోలవరం ఎత్తిపోతల పనులు

20 Apr, 2021 09:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమృద్ధిగా నీటిని విడుదల చేస్తూనే.. జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలైన మెట్ట ప్రాంతాల్లో గృహ అవసరాలు తీర్చడం కోసం పోలవరం ఎత్తిపోతలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.912.84 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు కనీస నీటిమట్టం 41.15 మీటర్లు. ప్రాజెక్టులో 35.50 మీటర్ల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోలవరం కుడి కాలువ ద్వారా గ్రావిటీపై నీటిని తరలించవచ్చు. కానీ.. నీటిమట్టం 35.50 మీటర్ల కంటే దిగువకు చేరితే పోలవరం కుడి కాలువలోకి చుక్క నీరు చేరదు.

పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేసవిలో ఈ ప్రాంతాల్లో తాగునీరు, గృహ అవసరాల కోసం తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో 35.50 మీటర్ల నుంచి 32 మీటర్ల వరకు ఉన్న నీటిని జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య కుడి కాలువ అనుసంధానంలోకి ఎత్తిపోసి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో గృహ అవసరాలకు సరఫరా చేయవచ్చని జనవరి 22న పోలవరం సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పోలవరం ప్రాజెక్టులో 32 మీటర్లకు దిగువన ఉన్న నీటిని గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమృద్ధిగా సరఫరా చేయవచ్చు. ఈ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి, 15 ఏళ్లు ఆ పథకం నిర్వహణకు రూ.912.84 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది.
చదవండి: సాగునీటి పనుల్లో స్పీడ్‌ పెరగాలి

>
మరిన్ని వార్తలు