‘ఇంటింటికీ రేషన్‌’ ఆపడమే ఎస్‌ఈసీ ఉద్దేశం

9 Feb, 2021 04:42 IST|Sakshi

అందుకే ప్రతిసారీ ఏదో కొత్త కారణం చెబుతున్నారు 

ఈ పథకం కొత్తది కాదు.. 2019లోనే ప్రారంభమైంది 

అన్ని వివరాలతో ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం 

అయినా ఏకపక్ష ఉత్తర్వులిచ్చారు

పథకాన్ని అడ్డుకోకుండా కమిషనర్‌ను ఆదేశించండి 

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌.. నేడు విచారణ 

సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్‌’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఇంటింటికీ రేషన్‌ కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాలకు అధికార పార్టీ రంగులు కాకుండా తటస్థ రంగును ఉపయోగించడంతో పాటు ఆ వాహనాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బొమ్మలను తొలగించాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసేంత వరకు తటస్థ రంగులను ఇలాగే ఉంచాలంటూ ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులు విచారణ జరపనున్నారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 

ఈ పథకం పాతదే.. 
‘ఇంటింటికీ రేషన్‌’పథకాన్ని 2019 జూన్‌లోనే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం సంచార వాహనాల ద్వారా సరుకుల పంపిణీకి నిర్ణయించి.. 9,260 వాహనాలను సమకూర్చాం. కోవిడ్‌ వల్ల ఈ పథకాన్ని 2020లోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కాలేదు. 2021 జనవరిలో వాహనాలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. జనవరి 21న ఈ వాహనాలను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మొదలు పెట్టిన పథకాలను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా.. వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులున్నాయంటూ ఇంటింటికీ రేషన్‌ పంపిణీని నిలిపి వేస్తూ ఎన్నికల కమిషనర్‌ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. పథకం అమలు ఎందుకు అవసరమో ఆధారాలతో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను 48 గంటల్లో ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై 5 రోజుల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్‌కు ఫిబ్రవరి 1న వినతిపత్రం సమర్పించాం. అన్ని వివరాలను తెలియజేసి.. పథకం ఎంత అవసరమో వివరించాం. వాహనాలపై ఉండే రంగులు అధికార పార్టీ రంగులు కాదని, వాటిని ఏ రాజకీయ పార్టీకి ఆపాదించవద్దని వివరించి పథకం అమలుకు అనుమతివ్వాలని కోరాం. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్‌ ఈ పథకం అమలుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులిచ్చారు. దీనిని బట్టి ముందుగానే తీసుకున్న నిర్ణయం ఆధారంగానే కమిషనర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారనే విషయం స్పష్టమవుతోంది అని కోన శశిధర్‌ ఆ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. 

మరిన్ని వార్తలు