పీఆర్సీ సిఫార్సుల అమలుకు సర్కారు సానుకూలం 

30 Oct, 2021 07:46 IST|Sakshi

 ఉద్యోగ సంఘాలకు సంగ్రహ నివేదిక

ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం

స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో సీఎస్‌ సమీర్‌శర్మ

సాక్షి, అమరావతి: పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ స్పష్టం చేశారు. ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమీర్‌ శర్మ మాట్లాడుతూ.. పీఆర్సీ సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో చర్చిస్తామన్నారు. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు.

పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలన్న డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. దీనిని సంబంధించి సంగ్రహ నివేదికను వారం రోజుల్లోగా అందిస్తామన్నారు. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సుమారు రెండేళ్లుగా ఆశాజనకంగా లేవని, వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్, హెచ్‌ఆర్‌ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.

వివిధ ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ 2010లో సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగ్గా.. పదేళ్ల అనంతరం ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఎస్‌ రావత్, వి.ఉషారాణి, గోపాలకృష్ణ ద్వివేది, బి.రాజశేఖర్, కార్యదర్శి శ్యామలరావు, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు