మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు ఏపీ సర్కార్‌ పెద్దపీట

17 Aug, 2022 03:52 IST|Sakshi

రాజీపడొద్దంటూ ఆదేశాలు.. మార్గదర్శకాలూ జారీ

తమ పరిధిలోని అన్ని స్కూళ్ల పనులను రోజు విడిచి రోజు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తనిఖీ చేయాలి

పక్షం రోజులకోసారి మండల ఇంజనీర్‌ సందర్శించాలి

నెలలో కనీసం 30 స్కూళ్లను డిప్యూటీ ఈఈ తనిఖీ చేయాలి

వీటి నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులందరికీ పంపాలి

నాడు–నేడు రెండో దశలో రూ.8వేల కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు, అదనపు తరగతి గదులు

సాక్షి, అమరావతి:  మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు కనీసం 80ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యతకు పెద్దపీట వేస్తోంది. అంతేకాక.. వాటి నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణకు నిధులను అందుబాటులో ఉంచింది. అలాగే, పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్‌ అధికారిని సైతం ఇటీవలే నియమించింది.

క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత తనిఖీ
ఇక గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.16,450 కోట్ల అంచనాలతో పనులను  చేపడుతోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు తొలిదశలో 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వాటి రూపురేఖలను విజయవంతంగా మార్చింది. ఇప్పుడు రెండో దశలో ఏకంగా రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణాలను చేపట్టింది. వీటిని అత్యంత నాణ్యతతో చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. నాడు–నేడు కింద సమకూరుతున్న విద్యా సంస్థల ఆస్తులు కనీసం 80 ఏళ్ల పాటు మన్నికతో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ప్రతీ దశ పనుల్లోనూ క్షేత్రస్థాయిలో నాణ్యతను తనిఖీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం.. పనులు అమలుచేస్తున్న ఏజెన్సీలు, తనిఖీలు చేసే ఇంజనీర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీచేసింది. 

మార్గదర్శకాలు ఇవే..
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, ఎమినిటీస్‌ కార్యదర్శి తమ పరిధిలోని నూటికి నూరు శాతం స్కూళ్లలో నాడు–నేడు పనులను రోజు విడిచి రోజు తనిఖీ చేయాలి.
మండల ఇంజనీర్‌ అన్ని స్కూళ్ల పనులను కనీసం 15 రోజులకోసారి సందర్శించి పనులను పరిశీలించాలి. 
డిప్యూటీ ఈఈ నెలలో కనీసం 30 స్కూళ్లను సందర్శించాలి.
ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నెలలో 10 స్కూళ్లలో నాడు–నేడు పనుల నాణ్యతను తనిఖీచేయాలి. 
ఇక క్వాలిటీ కంట్రోల్‌ బృందాలు నెలలో 20 స్కూళ్లకు వెళ్లాలి. 
ఎస్‌ఈ, సీఈ నెలలో కనీసం ఐదు స్కూళ్లను పరిశీలించాలి. 
ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ రెండు శాతం పనులను, థర్డ్‌ పార్టీ రెండు శాతం పనులను తనిఖీలు చేయాలి.
తనిఖీలు చేసే ఇంజనీర్లందరికీ మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచుతారు. 
తనిఖీల నివేదికలను ఈ అప్లికేషన్‌ ద్వారా సంబంధిత శాఖలకు పంపాలి.
తనిఖీల సమయంలో తమ దృష్టికి వచ్చిన అంశాలను సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు, ఏజెన్సీలకు తెలియజేయాలి.
చదవండి: మునుపెన్నడూ  ఇటు చూడని  పారిశ్రామిక  దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు

మరిన్ని వార్తలు