మళ్లించిన మిగులు జలాల్లో 50 శాతమే లెక్కలోకి!

29 Apr, 2021 04:54 IST|Sakshi

తాగు నీటికి పది టీఎంసీలు విడుదల చేయండి

కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన

దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి బోర్డు లేఖ  

సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో మళ్లించిన 21 టీఎంసీల మిగులు జలాల్లో 50 శాతాన్నే కోటా కింద పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కృష్ణా బోర్డు కోరింది. తద్వారా కోటా కింద మిగిలిన జలాలను తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువ ద్వారా 5, ఎడమ కాలువ ద్వారా 5 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కోరిందని తెలిపింది. వీటికి సమ్మతిస్తే ఏపీకి 10 టీఎంసీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌కు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ..

► నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద తాగు నీటి అవసరాల కోసం ఆరు నుంచి ఏడు టీఎంసీలు విడుదల చేయాలని ఈ నెల 9న తొలుత ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది.
► సాగర్‌ ఎడమ కాలువ కింద జోన్‌–2, జోన్‌–3ల పరిధిలో కృష్ణా జిల్లాలో నీటి ఎద్దడి నెలకొందని, తాగునీటి అవసరాల కోసం ఐదు టీఎంసీలను విడుదల చేయాలని ఈ నెల 15న ఏపీ సర్కార్‌ మరో లేఖ రాసింది.
► గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ మళ్లించిన మిగులు జలాలు 21 టీఎంసీల్లో 50 శాతాన్నే రాష్ట్ర కోటా కింద పరిగణనలోకి తీసుకోవాలని, దీని వల్ల తమ కోటాలో మరో పది టీఎంసీలు మిగులు ఉంటుందని, వీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ నెల 17న లేఖ రాసింది.
► ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. దీన్ని బట్టి ఏపీకి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు