దిగువ కృష్ణా ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకే!

24 Oct, 2020 04:44 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్ట్‌

ప్రాజెక్టుల స్పిల్‌ వేలు, జలవిద్యుత్‌ కేంద్రాలు బోర్డు అధీనంలోకి తీసుకోవాలి

కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌లు, ఎత్తిపోతల పథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి

నీటి విడుదల, నియంత్రణ అధికారులు బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలి

కృష్ణాబోర్డు పరిధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల పరిధిలో దిగువ కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల పరిధిలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాలు, కాలువల హెడ్‌ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలను బోర్డు అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. వీటికి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. జలాల కేటాయింపు.. వినియోగాన్ని టెలీమీటర్ల ద్వారా లెక్కించి ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాలకు తెలియజేయడం ద్వారా వివాదాలకు చెక్‌ పెట్టవచ్చని పేర్కొంది. ఈ మేరకు బోర్డు పరిధి, విధివిధానాలను ఖరారు చేయాలని కృష్ణా బోర్డుకు శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈనెల 6న కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో బోర్డు పరిధిని ఖరారు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకించింది. కేంద్రానికి ఉన్న విచక్షణాధికారాలను ఉపయోగించి కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

పరిధిపై ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను కోరిన బోర్డు
బోర్డు పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌పై ప్రతిపాదనలను శుక్రవారంలోగా పంపాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశం కోరారు. ఆ మేరకు బోర్డు పరిధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ..
► ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తోపాటు తెలంగాణలోని జూరాల, ఏపీలోని పులిచింతల, ప్రకాశం బ్యారేజీసహా రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి.
► ప్రాజెక్టుల స్పిల్‌ వేలతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రాలు, కాలువలకు నీరు విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాల పంప్‌ హౌస్‌లు, తాగునీటి పథకాలు, చిన్న నీటివనరుల విభాగంలోని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలి.
► ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల, నియంత్రణ అధికారులు బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాలి.
► ఆరునెలలకు ఒకసారి బోర్డు సమావేశం నిర్వహించాలి. నీటి సంవత్సరం ప్రారంభం నుంచి ముగిసేవరకు నీటి అవసరాలు, కేటాయింపులు, వినియోగంపై ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ భేటీలు నిర్వహించాలి.
► బోర్డు పరిధిలోని ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో పహరా ఏర్పాటు చేయాలి.
► బోర్డు నిర్వహణ, సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పహరాకు అయ్యే వ్యయాన్ని రెండు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలి. 

మరిన్ని వార్తలు