AP: ఖరీఫ్‌కు భరోసా

19 Apr, 2022 17:19 IST|Sakshi

ముందస్తు పెట్టుబడి అందజేతకు కసరత్తు

సీజన్‌ ప్రారంభానికి ముందే నగదు

ఏటా రైతుకు రూ.13,500 ఆర్థిక సాయం

మే నెలలో అర్హులకు రైతు భరోసా

సాక్షి, కాకినాడ:  ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే పంట సాగుకు పెట్టుబడిగా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైఎస్సార్‌ రైతుభరోసా పథకం కింద ఒక్కో రైతుకు రూ.13,500 అందజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే ప్రక్రియలో అధికారులు తలమునకలవుతున్నారు. మే నెలలో నగదు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అన్నదాతలను అవసరానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ రైతుభరోసా పథకానికి అంకురార్పణ చేసింది. దీనికింద అర్హులైన రైతులకు సాగు పెట్టుబడి నిమిత్తం ఏటా ఆర్థిక సాయం అందజేస్తోంది. తద్వారా పెట్టుబడి కోసం వారు అప్పులు చేయకూడదన్నది దీని ఉద్దేశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 4.35 లక్షల మంది రైతులకు రూ.317 కోట్లు అందజేస్తోంది.  
 
ఖరీఫ్‌కు ముందుగానే..
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రబీ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. 2022–23 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యేందుకు సుమారు మరో రెండు నెలలు పట్టనుంది. అంతకంటే ముందుగానే అన్నదాతలకు రైతుభరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 1,60,901 మంది రైతులు ఉండగా.. రూ.34.83 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. అర్హులందరికీ పథకం వర్తింపజేసే క్రమంలో కొన్ని నిబంధనలు సడలించారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన వారు, లబ్ధిదారులు చనిపోతే వారి కుటుంబంలో మరొకరు సాయం పొందే ప్రక్రియను సులభతరం చేశారు. పేరు మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

కౌలు రైతులకు..
కౌలు రైతులకు సైతం భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పథకానికి అవసరమైన కౌలు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. కార్డులు పొందాలనుకునే వారి నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మండల వ్యవసాయ అధికారి, సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు భరోసా పథకం సాధ్యాసాధ్యాలు, అర్హతలపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకం తీసుకుని సమీప రైతు భరోసా కేంద్రం(ఆర్‌బీకే)లో సంప్రదిస్తే సరిపోతుంది. గ్రామ వలంటీర్, సచివాలయం, వ్యవసాయ అధికారిని సంప్రదించినా పథకంలో లబ్ధి పొందవచ్చు. పథకం కింద ఏటా రూ.13,500 నగదును మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

అర్హులందరికీ భరోసా
వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో అర్హులెవరూ నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా అర్హుల జాబితా రూపొందించాం. అర్హత ఉండి తమకు పథకం వర్తించకుంటే సంబంధిత ఆర్‌బీకేలో సంప్రదిస్తే పరిశీలించి న్యాయం చేస్తారు. మే నెలలో భరోసా నగదు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.  
– ఎన్‌.విజయకుమార్,
జేడీ అగ్రికల్చర్, కాకినాడ జిల్లా

మరిన్ని వార్తలు