ఏపీ: మద్యం ప్రియులకు మరో షాక్‌

26 Oct, 2020 18:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం ప్రియులకు మరో షాక్‌ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు, లైసెన్స్‌ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ ఎక్సైజ్‌ శాఖ సోమవారం కొత్త జీవో విడుదల చేసింది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్‌ తెచ్చుకునేందుకు కూడా ఇక నుంచి అనుమతి లేదు. పర్మిట్ లేకుండా  ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు జీవో నెంబర్ 310ని ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఇక ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యంతో పాటు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (మద్యం షాక్‌ కొట్టింది!)


తెలంగాణ నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలించిన 70 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం (ఫైల్‌ ఫోటో)

దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్నముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా దశల వారీ మద్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేస్తున్న తరుణంలో సరిహద్దుల్లో ఉన్న ఆరు రాష్ట్రాల్ల నుండి ఒక్కొక్కరు మూడు బాటిల్స్‌కు మించకుండా మద్యం తీసుకొని రావటాన్ని నిరోధిస్తూ  ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1968 ఎక్సైజు చట్టంలోని 34వ  నిబంధనలను అనుసరించి ఇక మీదట ఏ ఇతర రాష్ట్రంనుంచి అయినా రాష్ట్రానికి మద్యాన్ని తరలించడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. (ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత..)


అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం (ఫైల్‌ ఫోటో)

ఈ నిర్ణయం పట్ల మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  మరోవైపు మద్యం నిర్మూలనకు మద్య విమోచన ప్రచార కమిటీ లఘు చిత్రాలు, పోస్టర్లతో ప్రచారం చేపట్టింది. మద్య నిషేధంపై అవగాహన కలిగించేందుకు డ్వాక్రా సంఘాలు, వలంటీర్ల సహాయం తీసుకుంటోంది. వ్యసనపరులను గుర్తించి డీఅడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి మద్యం మాన్పించేందుకు కృషి చేస్తోంది. (వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో..)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు