ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేశాం

4 May, 2021 05:21 IST|Sakshi

టెన్త్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు

హైకోర్టుకి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

తదుపరి విచారణ జూన్‌ 2కి వాయిదా

సాక్షి అమరావతి: కరోనా నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు సూచనలను, పిటిషనర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం వ్యవహారంపై సమీక్షించి ఈ నెల 5 నుంచి జరపాల్సిన ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సోమవారం హైకోర్టుకు తెలిపారు. పదోతరగతి పరీక్షల వాయిదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వచ్చే మూడు వారాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి పరీక్షల తేదీలను ఖరారు చేశారా? అని ధర్మాసనం అడిగింది. కరోనా, ఇతర పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని శ్రీరామ్‌ చెప్పారు. షెడ్యూల్‌ ఈ రోజు ఇచ్చి రెండు మూడురోజుల్లో పరీక్షలు ఉంటాయని చెప్పారు కదా.. అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేయగా, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇస్తామని ఏజీ తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తదుపరి విచారణను జూన్‌ 2కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు