తప్పుకోవాలని కోరే పరిస్థితులు మీరే కల్పించారు

22 Dec, 2020 03:38 IST|Sakshi

అత్యంత బాధాతప్త హృదయంతో ఈ మాట చెబుతున్నాం 

న్యాయం చేసినట్లు కాదు.. చేసినట్లు కనిపించాలి కూడా.. 

ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారు 

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 

విచారణ సందర్భంగా ఎన్నో అంటుంటాం 

రెక్యూజ్‌ పిటిషన్‌ను జస్టిస్‌ రమేశ్‌తో కలిసి విచారిస్తా.. స్పష్టం చేసిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ 

తదుపరి విచారణ 28కి వాయిదా 

సాక్షి, అమరావతి:  ప్రభుత్వ ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో జరుగుతున్న విచారణ నుంచి మిమ్మల్ని (జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌) తప్పుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసే పరిస్థితులు మీరే కల్పించారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌కు స్పష్టంచేసింది. ఈ విషయాన్ని బరువెక్కిన బాధాతప్త హృదయంతో చెబుతున్నామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వివరించారు. కేవలం న్యాయం చేయడమే కాదని, న్యాయం చేసినట్లు కూడా కనిపించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపై ఉందన్నారు. ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని తెలిపారు.

ప్రభుత్వాన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేయడమే కాక, వాదన వినిపించకుండా గొంతు కూడా నొక్కారని వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌.. విచారణ సందర్భంగా ఎన్నో అంటుంటామని, సమాధానాలు రాబట్టేందుకు పలు ప్రశ్నలు అడుగుతుంటామని, వాటికి సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు. తాను ఈ వ్యాజ్యాల్లో విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ, ఈ రెక్యూజ్‌ (విచారణ నుంచి తప్పుకోవడం) పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేశానో లేదో ప్రస్తుత ధర్మాసనంలో ఉన్న తన సోదరి జడ్జి జస్టిస్‌ ఉమాదేవి చెప్పలేరని, అందువల్ల అప్పటి బెంచ్‌లో ఉన్న జస్టిస్‌ డి.రమేశ్‌తో కలిసి ప్రభుత్వ పిటిషన్‌ (రెక్యూజ్‌) విచారిస్తానని జస్టిస్‌ రాకేశ్‌ తెలిపారు.

అందులో భాగంగా విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే, ప్రభుత్వం దాఖలు చేసిన రెక్యూజ్‌ పిటిషన్‌పై పిటిషనర్లు కావాలనుకుంటే ఈ నెల 23 నాటికి కౌంటర్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు. ఈ మేరకు జస్టిస్‌ రాకేశ్, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.   మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న సర్కారు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రాకేశ్‌ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇటీవల ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో ఆయన పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ, విచారణ నుంచి ఆయనను తప్పుకోవాలని కోరుతూ రెక్యూజ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మిగిలిన వ్యాజ్యాలతో పాటు ఈ రెక్యూజ్‌ పిటిషన్‌పై కూడా ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. 

కోర్టులతో పనిలేకుండా అన్నీ ప్రభుత్వం చేస్తుందని మీ ఉద్దేశమా? 
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన బి.నళిన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ ధర్మాసనం సభ్యుడిగా ఉండాలా? లేక విచారణ నుంచి తప్పుకోవాలా? అన్నది మీరు (జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌) మాత్రమే స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. ఈ సమయంలో.. ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను న్యాయబద్ధమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనికి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పందిస్తూ, ప్రజలు పూర్తిస్థాయి తీర్పునిచ్చారు కాబట్టి, న్యాయస్థానాలతో పనిలేకుండా అన్నీ మేమే (ప్రభుత్వం) చేసేస్తామన్నది మీ ఉద్దేశమా? అంటూ ప్రశ్నించారు. అది తన ఉద్దేశంతో ఎంతమాత్రం కాదని పొన్నవోలు తెలిపారు. 

నా చివరి దశలో ఇలాంటి పిటిషన్లు వస్తాయనుకోలేదు.. 
అనంతరం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పందిస్తూ, జస్టిస్‌ రమేశ్‌తో కలిసే ఈ రెక్యూజ్‌ పిటిషన్‌ను విచారించడం సబబుగా ఉంటుందని తెలిపారు. పదవీ విరమణ దశలో తనపై ఇలాంటి పిటిషన్లు వస్తాయని అనుకోలేదని, చివరి శ్వాస వరకు న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు ప్రయత్నిస్తానని జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యానించారు.    

మరిన్ని వార్తలు