దివ్వెల దీపావళి

13 Nov, 2020 04:27 IST|Sakshi

పర్యావరణ హితమైనవే వాడాలి

మాస్కులు ధరించటంతోపాటు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు

పండుగరోజు అంతా ఆనందంగా ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు

సాక్షి, అమరావతి : ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి వేడుకలను జాగ్రత్తల నడుమ నిర్వహించుకోవాలని కోరుతోంది. దీపావళి అంటేనే టపాసుల సంబరం కావడంతో పర్యావరణ హితమైన గ్రీన్‌ క్రాకర్స్‌ను మాత్రం రెండు గంటల పాటు పరిమితంగా వినియోగించేందుకు అనుమతించింది. ఈ సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలకు సూచిస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. వైరస్‌ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ రోజు ప్రజలంతా ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం టపాసులు కాల్చడాన్ని, బాణసంచా విక్రయాలను నిషేధించగా కొన్ని చోట్ల నియంత్రించాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 

రెండు గంటలు ఓకే...
దీపావళి రోజు రెండు గంటలు పాటు బాణాసంచా వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమతిలేని బాణాసంచా దుకాణాలు, టపాసుల వినియోగంపై అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ తదితర శాఖలతో సమన్వయంతో పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇష్టానుసారంగా తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. కాలుష్యం, కరోనా విస్తృతిపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా స్వచ్చందంగా టపాసుల వినియోగాన్ని తగ్గించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ దిశగా పోలీస్‌ యంత్రాంగానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తగిన ఆదేశాలు ఇచ్చారు. నివాసాల మధ్య భద్రత లేని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా టపాసులు విక్రయించకుండా చర్యలు చేపట్టారు. తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రిటైల్, హోల్‌సేల్‌ దుకాణాలు ఏర్పాటు చేసేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని స్థల యజమాని అంగీకారపత్రంతోపాటు అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. 

ఆంక్షలకు కారణాలు ఇవీ..
– శీతాకాలంలో వైరస్‌లు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో టపాసులు పేల్చితే కాలుష్యం కారణంగా వైరస్‌ మరింత విస్తరించే ముప్పు ఉంది. వాయుకాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కరోనా బాధితులకు ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
– ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో బాణసంచా కాల్చడం, విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరు 30 వరకు బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. క్రిస్మస్‌ సహా నూతన ఏడాది వేడుకల్లోనూ బాణాసంచా కాల్చేందుకు కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ గతవారం 23 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబరు 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించడంపై ఎన్‌జీటీ చైర్మన్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ ధర్మాసనం రాష్ట్రాల స్పందన కోరింది.
– కాలుష్యం నివారణకు బాణాసంచా వినియోగాన్ని నిషేధించాలంటూ కొందరు పర్యావరణ వేత్తలు 2018లో సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేలా అనుమతించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా