కరోనా వచ్చినా కంగారొద్దు.. 

9 Jan, 2023 09:35 IST|Sakshi

పుష్కలంగా మందులు.. సరిపడా పడకలు 

కరోనా వ్యాప్తి మొదలైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభుత్వం  

8,594 ఐసీయూ, 34,763 ఆక్సిజన్, 12 వేల సాధారణ పడకలు సిద్ధం 

ప్రభుత్వాస్పత్రుల్లో  170 పీఎస్‌ఏ ప్లాంట్లు 

అందుబాటులో 15 వేలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 33 వేల సిలిండర్లు  

పరీక్షల నిర్వహణకు 14 లక్షల ఆర్టీపీసీఆర్, 8.44 లక్షల ఆర్‌ఎన్‌ఏ కిట్లు 

సాక్షి, అమరావతి: కరోనా మొదటి, రెండో విడత ఉధృతిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న తాజా వ్యాప్తిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు  మొదలు చికిత్స అందించడానికి, వైరస్‌ నియంత్రణకు అన్ని వనరులను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఇంకా అవసరమయ్యే పరికరాలు, వస్తువుల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. గతంలో వైరస్‌ వ్యాప్తి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రులుగా వైద్య శాఖ నోటిఫై చేసింది. వైరస్‌ వ్యాప్తి, పాజిటివ్‌ కేసులు తగ్గడంతో ఈ ఆస్పత్రులను డీ నోటిఫై చేశారు. మళ్లీ పాజిటివ్‌ కేసుల నమోదు పెరిగితే ఆస్పత్రులను తిరిగి నోటిఫై చేయనున్నారు. ఆయా ఆస్పత్రుల్లో 8,594 ఐసీయూ, 34,763 ఆక్సిజన్, 12,292 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయి. 5813 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐసోలేషన్‌/క్వారంటైన్‌ పడకలు 54వేల చొప్పున ఉన్నాయి. 1,092 పీడియాట్రిక్‌ ఐసీయూ పడకలు, 5,610 పీడియాట్రిక్‌ వెంటిలేటర్లు, 297 నియోనాటల్‌ వెంటిలేటర్లు ఉన్నాయి. 

ప్రాణవాయువు పుష్కలం 
రెండో విడత కరోనా వ్యాప్తిలో ఆక్సిజన్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. ఆæ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆక్సిజన్‌కు  కొరత రాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 170 పీఎస్‌ఏ ప్లాంట్‌లు నెలకొల్పడంతో పాటు 33,902 డీ–టైప్‌ సిలెండర్లు, 15,565 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సమకూర్చారు. మరోవైపు స్వల్ప లక్షణాలుండి ఇంటిలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారికి అందజేసేందుకు 4,61,729 హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి 16,32,714 ఎన్‌ 95 మాస్క్‌లు, 4,80,441 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి 14,24,000 ఆర్టీపీసీఆర్, 8,44,763 ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్లు ఉన్నాయి. 

జాగ్రత్తలు పాటించాలి 
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌–7 కేసులు నమోదవలేదు. డిసెంబర్‌ నెలలో ఇప్పటివరకు 48 నమూనాలను జీనోమ్‌ ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ కేసులన్నీ ఒమిక్రాన్‌కు సంబంధించినవే. ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు ప్రారంభించాం. అంతర్జాయతీ ప్రయాణికులకు ఎరికైనా పాజిటివ్‌గా తేలితే వారి నమూనాలను జీనోమ్‌ ల్యాబ్‌కు పంపి సీక్వెన్సింగ్‌ చేపట్టాలని నిర్ణయించాం.  
– జె. నివాస్, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు