విగ్రహాల ధ్వంసం: ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

8 Jan, 2021 21:12 IST|Sakshi

ఆలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్‌ విచారణకు ఏపీ సర్కార్‌ ఆదేశం

సీఐడీ నుంచి సిట్‌కు విచారణ బదిలీ..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్‌ విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ నుంచి సిట్‌కు విచారణ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. 16 మందితో సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా ఐపీఎస్‌ అధికారి జీవీజీ ఆశోక్‌ కుమార్‌, ప్రస్తుతం ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్న జీవీజీ ఆశోక్‌ కుమార్‌, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబులను నియమించింది. ఆలయాలపై దాడులకు సంబంధించి అన్ని కేసులను సిట్‌ విచారించనుంది. ‌రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ మతం హింసను ప్రేరేపించదు: మత పెద్దలు)

వారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌
విశాఖపట్నం: ఏటిగైరంపేటలో వినాయకుని చేతులు విరిచేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారం వెనుక అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ఉన్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు, విజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుట్ర వెనుక అయ్యన్న పాత్ర లేకపోతే నిందితులను వదిలిపెట్టాలని విజయ్‌ ఎందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏడాది క్రితం వినాయకుని బొమ్మ పాడైపోతే ఇప్పుడు విగ్రహం పగలగొట్టినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని ఉమాశంకర్‌ గణేష్‌ మండిపడ్డారు.(చదవండి: పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు అనుమతి లేదు..)


 

మరిన్ని వార్తలు