క్యాన్సర్‌ చికిత్సపై సీఎం జగన్‌ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు: కృష్ణబాబు

11 Jun, 2022 14:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్‌పై ఒప్పందం జరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఏపీలో క్యాన్సర్ చికిత్సకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. గత ఏడాది లక్షా 30 వేల మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కిలోమీటర్లకు క్యాన్సర్ వైద్యం అందే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించి వైద్యం అందించాలనే ఆలోచన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు క్యాన్సర్‌కి సంబంధించి టెలి కన్సల్టెన్సీ సర్వీస్ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. 

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్‌ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్‌ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్‌ అంకాలజీ, క్యాన్సర్‌ డే కేర్‌ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది.

ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్‌ రోగులు, హైరిస్క్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్‌ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్‌ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్‌ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్‌ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే  చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు.   

చదవండి: (టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్‌)

మరిన్ని వార్తలు