ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

8 May, 2021 13:22 IST|Sakshi

సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో స్టీల్ ప్లాంట్, నేవీతో అధికారుల చర్చలు

సాక్షి, విజయవాడ: ఆక్సిజన్ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో స్టీల్ ప్లాంట్, నేవీతో అధికారులు చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు భేటీ అయ్యారు. అన్ని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను తుర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీలు, స్థితిగతులు, జాగ్రత్తలతో నిర్వహణకు తూర్పు నావికాదళం ముందుకొచ్చింది.

అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎక్కడ అవసరమైతే అక్కడికి విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్లలోని సాంకేతిక లోపాలను సవరించేందుకు నేవీ సాయపడనుంది. సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా నుండి ఏపీకి ఆక్సిజన్ తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ తరలించేందుకు నేవీ అంగీకారం తెలిపింది. ఐఎన్‌ఎస్‌ కళింగ్ ఆస్పత్రిలో 60 బెడ్లు కోవిడ్‌కి కేటాయించేందుకు అంగీకరించింది.

కంచరపాలెంలో 150 పడకల ఆస్పత్రికి మౌలిక సదుపాయాల కల్పనకు నేవీ అంగీకారం తెలిపింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చనుంది. గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్‌ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నారు. మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయని స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ వెల్లడించారు.  మే 30 నాటికి 250 పడకలు, జూన్‌ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు  స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు తెలిపారు. అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్‌ సిబ్బందిని అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు కోరారు.

నేవీ, స్టీల్‌ ప్లాంట్‌ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్‌ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్‌ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు  కృతజ్ఞతలు తెలిపారు. 850 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్‌ టన్నుల ఎంఎల్‌ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు వెల్లడించారు. ఆరు నెలల్లో ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
చదవండి:
కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
ముగ్గురాయి గనుల్లో పేలుడు, సీఎం జగన్ దిగ్భ్రాంతి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు