సైనికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ

8 Apr, 2021 04:57 IST|Sakshi
మృతుడి తల్లిదండ్రులకు చెక్కు అందజేస్తున్న ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే అంబటి

మృతుని తల్లిదండ్రులకు రూ.30 లక్షల చెక్కు అందజేత 

సత్తెనపల్లి: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుని తల్లిదండ్రులు శాఖమూరి విజయకుమారి, రవీంద్రబాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు ఆర్డీవో ఎస్‌.భాస్కర్‌రెడ్డి బుధవారం రూ.30 లక్షల చెక్కును అందజేశారు. తహసీల్దారు ఎస్‌.వి.రమణకుమారి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

హోంశాఖ మంత్రి  పరామర్శ..
మృతి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత  పరామర్శించారు. మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   

మరిన్ని వార్తలు