AP: సాయం, పరిహారం.. శరవేగం

29 Nov, 2021 10:33 IST|Sakshi

వారంలోనే వరద బాధితులను ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం

వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సత్వర సాయం

మృతి చెందిన, గల్లంతైన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు

శిబిరాల్లో ఉన్న వారికి రూ.2 వేలు, నిత్యావసర వస్తువులు

యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా రోడ్లు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

సాక్షి ప్రతినిధి, కడప/చిత్తూరు కలెక్టరేట్‌/నెల్లూరు(అర్బన్‌): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. తక్షణ సాయం అందించడంలో యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. మృతి చెందిన, గల్లంతైన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, పునరావాసాల్లోని బాధితులకు రూ.2000 చొప్పున వారంలోపు ఆర్థిక సహాయం పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఎక్కడికక్కడ నిత్యావసర వస్తువులు సైతం పంపిణీ చేసింది. గతంలో ఈ రీతిన సహాయం అందజేయడానికి నెలల సమయం పట్టేది. 

వైఎస్సార్‌ జిల్లాలో వరదల్లో మృతి చెందిన, గల్లంతైన 42 మందికి రూ.5 లక్షలు చొప్పున రూ 2.10 కోట్ల పరిహారాన్ని అందించింది. వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు సైతం పరిహారం పంపిణీ చేసింది. ముంపు గ్రామాల్లో కూలిన ఇళ్ల  శిథిలాలను తొలగించారు.

యుద్ధ ప్రాతిపదికన గ్రామాలకు తాత్కాలికంగా రోడ్లు వేశారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ముంపునకు గురైన ఇళ్లను అగ్నిమాపక శాఖ ద్వారా శుభ్రం చేయించారు.  వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంటువ్యాధులు ప్రబలకుండా నిత్యం పారిశుధ్య పనులను చేపట్టారు.

7,337 కుటుంబాల పరిధిలో 16,700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్‌సర్వీసు, నేవీ బృందాలు ఇందుకోసం పని చేశాయి. 104 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. మరో 104 రిలీఫ్‌ సెంటర్లకు 8,563 మందిని తరలించారు.

లక్షా 50 వేల భోజన ప్యాకెట్లను, 34 లక్షల 75 వేల నీటి ప్యాకెట్లను అందజేశారు. 7,827 కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున రూ.1.57 కోట్ల సాయం అందించారు. మృతి చెందిన, గల్లంతైన 42 మంది కుటుంబాలకు రూ.2.10 కోట్లు పంపిణీ చేశారు. 

మృతి చెందిన పశువులకు రూ.1.50 కోట్లు.. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 2,167 గృహాలకు రూ.6.72 కోట్లు పంపిణీ చేశారు. 1,322 కుటుంబాలకు రూ.15 వేలు చొప్పున, మరో 1,322 కుటుంబాలకు రూ.3,800 చొప్పున పంపిణీ చేశారు.

33,451 మందికి తక్షణ సాయం
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 33,451 మంది వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.2 వేలు చొప్పున తక్షణ సాయం అందజేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటర్‌ వంటనూనె, కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళదుంపలు పంపిణీ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి రూ.2.97 కోట్ల నష్ట పరిహారం అందజేశారు. 

జిల్లాలో 2009 ఇళ్లకు నష్టపరిహారాన్ని చెల్లించారు. ఇందులో పూర్తిగా దెబ్బతిన్న 237 పక్కా, కచ్చా ఇళ్లకు రూ.95,100 చొప్పున రూ.2,25,38,700.. పాక్షికంగా దెబ్బతిన్న 69 పక్కా ఇళ్లకు రూ.5,200 చొప్పున రూ.3,58,800.. స్వల్పంగా దెబ్బతిన్న 575 కచ్చా ఇళ్లకు రూ.3,200 చొప్పున రూ.1,84,000.. 1218 గుడిసెలకు రూ.4,100 చొప్పున రూ.49,93,800 నష్ట పరిహారం అందజేశారు.

మృతి చెందిన పశువులకు సంబంధించి రూ.18.06 లక్షలు బాధితులకు అందజేశారు. మృతి చెందిన, గల్లంతైన 8 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు. 

48,900 కుటుంబాలకు భరోసా
నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన 48,900 కుటుంబాలకు రూ.2 వేల నగదుతో పాటు నిత్యావసర వస్తువులు అందజేశారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పంపిణీ చేశారు. మృతి చెందిన పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలకు సంబంధించి యజమానులకు రూ.33,99,450 అందజేశారు. 

రూ.3.38 కోట్ల విలువైన 2,140 మెట్రిక్‌ టన్నుల సంపూర్ణ మిశ్రమ పోషణ దాణాను రైతులకు అందజేస్తున్నారు. వరదలో మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులకు రూ.5 లక్షల నష్టపరిహారం అందజేశారు. కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేస్తున్నారు.    

మరిన్ని వార్తలు