ఏపీ రైతుల హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్‌

12 Jul, 2021 02:02 IST|Sakshi
ప్రాజెక్టును సందర్శించిన ఉదయభాను

ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఆగ్రహం 

పులిచింతలకు వెళ్తుండగా ముక్త్యాల వద్ద అడ్డుకున్న తెలంగాణ పోలీసులు 

నాటు పడవలో వెళ్లి ప్రాజెక్టు పరిశీలన.. తెలంగాణ విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌  

జగ్గయ్యపేట/అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్‌ రైతుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఆయన్ను తెలంగాణ పోలీసులు రాష్ట్ర సరిహద్దులోని బుగ్గమాధవరం వద్ద ఆదివారం అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన చేశారు. తర్వాత ముక్త్యాలలోని కృష్ణానది వద్దకు చేరుకుని నాటు పడవల ద్వారా గుంటూరు జిల్లా మాదిపాడులోని అవతలి ఒడ్డుకు చేరుకుని రైతులు, విలేకరులతో కలిసి పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు.  

విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.. 
అనంతరం ఉదయభాను మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో జల విద్యుదుత్పత్తికి పూనుకోవటంతో నీరందక సాగు సాగని పరిస్థితి నెలకొందన్నారు. పులిచింతలతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల వద్ద తెలంగాణ సర్కార్‌ అక్రమ విద్యుదుత్పత్తికి పాల్పడుతోందన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవాలని, లేకుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.  

నీటి వృధా శ్రేయస్కరం కాదు.. 
గత 10 రోజుల వ్యవధిలో ఏడున్నర టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలో కలిపారని ఉదయభాను తెలిపారు. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీని వృధా చేశారని, ఒక టీఎంసీ అంటే 10 వేల ఎకరాల మాగాణి, 20 వేల ఎకరాల మెట్ట పంటలకు సరిపోతాయన్నారు. ఇది ఉభయ రాష్ట్రాల రైతాంగానికి శ్రేయస్కరం కాదన్నారు. కృష్ణా, డెల్టా ప్రాంతాలకు చెందిన 13 లక్షల ఆయకట్టు భూములకు సమృద్ధిగా సాగునీటిని సరఫరా చేసేందుకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరగక పోతే తెలంగాణ వాటాగా 120 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు వచ్చేదా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది తెలంగాణ రైతులేనన్నారు. అలాంటి మహానేతపై తెలంగాణ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ వారితో స్నేహపూర్వకంగా మెలగాలని చెబుతున్నారని, అవసరం అనుకుంటేనే కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా పవర్‌ ప్రాజెక్టుకు అక్రమంగా నీటిని వదిలే చర్యను విరమించుకోవాలన్నారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లి ఈఈ శ్యాంప్రసాద్‌తో మాట్లాడి నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు జగదీష్, రవి, జుబేర్, ఫిరోజ్‌ఖాన్, హరిబాబు, సత్యనారాయణ, మాదిపాడు సర్పంచ్‌ నాగేశ్వరరావు, తదితరులు ఆయన వెంట ఉన్నారు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు