AP: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈఎంఐలో ఈ–స్కూటర్లు అందించనున్న ప్రభుత్వం

14 Sep, 2022 09:37 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. 

తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనుంది. కొనుగోలు చేసిన ఈ–స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ–స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 

ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్‌ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) అధికారులు సిద్ధం చేశారు. ఈ–స్కూటర్లు అందుబాటులోకి వస్తే.. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకోగానే 3 గంటల పాటు చార్జింగ్‌ పెడితే చాలు.. రోజంతా ఈ–స్కూటర్‌ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది. 

10 వేలకు పైగా.. 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేలకు పైగా ఈ–స్కూటర్లు, ఈ–కార్లు ఉన్నాయి. వీటి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకసారి కారుకు రీచార్జ్‌ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంటుంది. ఇప్పటి వరకూ కారుకు 6 గంటల పాటు చార్జ్‌ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం 45 నిమిషాల్లోనే చార్జ్‌ చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రాజమహేంద్రవరంలో టాటా సంస్థ రెండు చార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. మిగతా వాటి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.  

ఉద్యోగులకు ప్రాధాన్యం 
విద్యుత్‌ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటిని తొలుత ప్రభుత్వోద్యోగులకు ఇస్తాం. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు ఉద్యోగులకు విక్రయిస్తాం. ఈ వాహనాల ద్వారా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్‌ పెట్టవచ్చు. త్వరలో జిల్లాకు వాహనాలు వచ్చే అవకాశం ఉంది. వివరాలకు నెడ్‌కాప్‌ డీఎంను 9000 550 972, డీఓను 99 899 49 144 నంబర్లలో సంప్రదించవచ్చు. 
– జి.సత్యనారాయణ, జిల్లా మేనేజర్, నెడ్‌క్యాప్‌

మరిన్ని వార్తలు