పట్టుబట్టిన రాష్ట్రం.. చేజిక్కిన 'పవర్'

17 Feb, 2021 03:23 IST|Sakshi

విద్యుత్‌ సంస్కరణలపై ఏపీ సర్కార్‌ తొలి విజయం

నియంత్రణ కమిషన్‌ ఆధిపత్యంపై కేంద్రం వెనకడుగు

ముసాయిదాలో మార్పులు

కరెంట్‌ బిల్లులు నిర్ణయించే అధికారం ఇక ఏపీఈఆర్‌సీకే

సంస్కరణలపై ఆదిలోనే ఏపీ అభ్యంతరం.. అదే బాటలో అన్ని రాష్ట్రాలు

సవరణపై నేడు రాష్ట్రాలతో కేంద్రం మంతనాలు

సాక్షి, అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించే కేంద్ర విద్యుత్‌ సంస్కరణలపై రాష్ట్రం చేసిన ఒత్తిడి ఫలించింది. కీలకమైన విద్యుత్‌ ధరల నియంత్రణాధికారం తమ గుప్పిట్లోకి తీసుకునే ఆలోచనను విరమించుకుంది. రాష్ట్రాలకే ఈ అధికారం ఉండేలా ముసాయిదాలో మార్పు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు వీలుగా కేంద్రం ఓ మెట్టు దిగింది. సవరించిన ముసాయిదాపై బుధవారం కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు అన్ని రాష్ట్రాల విద్యుత్‌ అధికారులతో చర్చించనున్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రజలపై ఇష్టానుసారం విద్యుత్‌ చార్జీల భారం పడకుండా నియంత్రించే వీలుంది. 

ముందే స్పందించిన ఏపీ
కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా చట్ట సవరణకు ముసాయిదా ప్రతిని గత ఏడాది రాష్ట్రాలకు పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్‌ ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ఉంటుంది. దీన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నది సంస్కరణల్లో ఒక అంశం. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. డిస్కమ్‌లు అందించే విద్యుత్‌ వినియోగదారుడికి చేరడానికి యూనిట్‌కు రూ.6 పైనే అవుతుంది. ఇంత భారం పేద, మధ్య తరగతిపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 2020–21లో రూ.1700 కోట్లు గృహ విద్యుత్‌కు సబ్సిడీ ఇచ్చింది. రైతన్నకు 9 గంటల పగటి పూట విద్యుత్‌ ఇవ్వడానికి ఏకంగా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోకెళ్తే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఏపీ స్ఫూర్తితోనే ఇతర రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. 

ముసాయిదాపై నేడు చర్చ
రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అయితే, ఏపీఈఆర్‌సీలోనూ తమూ ఒక సభ్యుడిని నియమించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనికి తోడు డిస్కమ్‌లు, విద్యుత్‌ ఉత్పత్తిదారులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో ట్రిబ్యునల్‌ ఏర్పాటును  సూచిస్తోంది. ఈ ప్రతిపాదనను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్పత్తి ధరను ఖరారు చేసేది రాష్ట్రాలైనప్పుడు ట్రిబ్యునల్‌ ఢిల్లీలో ఉంటే సమస్యలొస్తాయని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిపే చర్చలు కీలకం కాబోతున్నాయి. ఏపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రానికి స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చాలని నిర్ణయంచుకున్నట్టు విద్యుత్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  
  

మరిన్ని వార్తలు