ఏపీ: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

26 Mar, 2021 10:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇదే రోజున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా బంద్‌ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక రూపాల్లో నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా నేడు ఏపీ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు రోడ్డెక్కనున్నాయి.

కాగా, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాలుపంచుకుంటున్నాయి. బీజేపీ, జనసేన మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపట్టారు. గ్రేటర్‌ విశాఖలో సైతం ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా పాఠశాలలు, కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. అదే విధంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు సైతం బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూతపడ్డాయి.

మద్దిలపాలెం, గాజువాక జంక్షన్‌లో వామపక్షాలు నిరసనలు చేపట్టగా.. చిత్తూరు జిల్లాలో సైతం వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, సాగుచట్టాలను రద్దు చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బంద్ నేపథ్యంలో డీజీపీ  సవాంగ్‌ అవసరమైన చర్యలు చేపట్టారు.  అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లను డీజీపీ ఆదేశించారు.


చదవండి: నేడే భారత్‌ బంద్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు