కెప్టెన్‌ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ ఆవేదన

15 Dec, 2021 15:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ భరతమాత సేవలో అసువులు బాసారని, దేశ ప్రజలు వారిని ఎప్పటికీ మరువరన్నారు. వరుణ్ సేవలు చిరస్మరణీయమన్న గవర్నర్  ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్  చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది అమరులయ్యారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించిన వారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడారు. ధైర్యసాహసాలతో దేశానికి సేవ చేసిన వరుణ్ సింగ్ కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
చదవండి: బస్సు ప్రమాదం: సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

మరిన్ని వార్తలు