AP: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించిన గవర్నర్

23 Jan, 2022 14:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని తెలిపారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్‌ దివస్‌’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ దేశంలోని అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారని తెలిపారు. బోసు జయంతి సందర్భంగా జరుపుకునే ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవడానికి ‘పరాక్రమ్ దివస్’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు