స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులకు ఏపీ గవర్నర్‌ ఘన సత్కారం

12 Aug, 2022 14:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు’లో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబసభ్యులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఘనంగా సన్మానించారు. 

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనుమరాలు సుశీల, స్వాతంత్ర సమరయోధులు కోపల్లె హనుమంతరావు మనుమడు హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనుమడు కాకాని విజయ్ కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు  మనుమడు ఇవటూరి కృష్ణకుమార్.. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చింతకాయల చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి మనవరాలు భోగిరెడ్డి  ఆదిలక్ష్మి, పెనుమత్స సుబ్బన్న భార్య శ్యామలను గవర్నర్‌ ఘనంగా  సత్కరించారు.

పింగళి వెంకయ్య..
పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారంతా వివిధ జాతీయ జెండాలను ఉపయోగించేవారు.. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించి మహాత్మా గాంధీ విజయవాడ పర్యటనలో వారికి అందించారు. "పింగళి వెంకయ్య వ్యవసాయవేత్త, మచిలీపట్నంలోనూ విద్యాసంస్థను స్థాపించిన విద్యావేత్త. 1963లో పేదరికంతో మరణించారు.

2009 లో పింగళి స్మారకార్థం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" ప్రారంభోత్సవం సందర్భంగా గంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్‌మోహన్ రెడ్డి సన్మానించారు. వారి మనుమరాలు సుశీలను గవర్నర్ నేడు ఘనంగా సత్కరించారు.

కోపల్లె హనుమంతరావు
కోపల్లె హనుమంతరావుగారు 1879, ఏప్రిల్ 12 న మచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరు చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాదిగా బందరులో పనిచేసారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు. హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఎం.ఏ, లా డిగ్రీ చదివి  ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసారు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు.

1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపుతో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల ఇప్పటీకీ నడుస్తున్నాయి. వీరు కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగక ప్రయత్నించి అప్పట్లోనే లక్షలాది రూపాయల ధనంతో ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ కళాశాల 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది. వీరి మనుమడు హనుమంతరావుగారు ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం ఉన్న ప్రాంతానికే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.. వారిని గవర్నర్‌ ఘనంగా సత్కరించారు.

కాకాని వెంకటరత్నం
ప్రముఖ స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు కాకాని వెంకటరత్నంగారు ఉక్కు కాకాణిగా పేరుగాంచారు.. 1900 సంవత్సరం ఆగస్టు 3న తేదీన కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో జన్మించారు, మహాత్మాగాంధీ ఉపదేశాలకు స్ఫూర్తి చెంది 1924లో కాంగ్రెస్ లో పనిచేశారు, 1930 ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1955 లో శాసనభ్యులుగా తొలి అడుగులువేసి మంత్రిగా పనిచేసారు. 1972 లో జైఆంధ్రా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.. ఆ ఉద్యమంలో విద్యార్థుల పై పోలీసులు కాల్పుల్లో మరణించారు అన్న వార్త విని డిసెంబర్ 25 న గుండెపోటు తో మరణించారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వారి మనుమడు కాకాని విజయ్ కుమార్‌ను గవర్నర్ ఘనంగా సత్కరించారు.

అయ్యదేవర కాళేశ్వరరావు
అయ్యదేవర కాళేశ్వరరావుగారు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకర్.. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాడిన మలితరం మహా నాయకులలో డా.పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారున్నారు. కాళేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసి. 1881 జనవరి 22వ తేదీన జన్మించిన కాళేశ్వరరావు బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో విశేష కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను పనిచేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు. వారి మనుమడు ఇవటూరి క్రిష్ణకుమార్  గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు.

చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు
చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు విజయవాడవాసులు.. మొదటినుండి జాతీయ భావాలు కలిగిన వీరు జాతీయ ఉద్యమంలో ఈ ప్రాంతంనుండి ప్రాతినిధ్యం వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసారు. అనేకమార్లు అరెస్ట్ కాబడి బ్రిటిష్ పోలీసులచేత దెబ్బలు తిన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారికి ఆరోజుల్లో వారిచేతులతోనే భోజనాలు వండి పెట్టేవారు. వీరి కుమారులు చింతకాయల చిట్టిబాబు గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు.

పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి
వీరు ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మిలకు జైలు శిక్ష పడగా వారికి కారాగారంలో పసల కృష్ణభారతి జన్మించారు. 1921లో గాంధీ సమక్షంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వీరిని 1931లో ఆంగ్లేయ సర్కారు జైలుకు పంపించింది. నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను ఒడిలో పట్టుకొనే జైలుజీవితం గడిపారు.  పదినెలల గర్భంతోనే  జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పసల కృష్ణభారతి గారి పాదాలకు నమస్కరించి ఆమెను సన్మానించారు. పసల కృష్ణమూర్తి అంజ లక్ష్మి మనవరాలు భోగిరెడ్డి  ఆదిలక్ష్మిని  గవర్నర్ ఘనంగా సత్కరించారు.

పెనుమత్స సుబ్బన్న
సుబ్బన్న గారు.. ప్రముఖ స్వతంత్ర పోరాట సమరయోధుడు స్వాతంత్రం కోసం జైలుజీవితం గడిపిన వ్యక్తి.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బన్న గాంధీజీ ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిసారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశమంతా ప్రజల తిరుగుబాటుతో ఆంగ్ల ప్రభుత్వ పరిపాలనను స్తంభించే విధంగా పనిచేశారు. ఆంగ్లేయులు ఆయనను ఏలూరు, బళ్లారి జైళ్లల్లో పలుసార్లు బంధించారు. ఆ జైలలో పొట్టి శ్రీరాములు వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహా నాయకులతో సన్నిహితంగా ఉన్నారు.  2007 సెప్టెంబర్ 22న అనారోగ్యంతో మరణించారు. పెనుమత్స సుబ్బన్నగారి భార్య శ్యామలను గవర్నర్‌ ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు