త్వరితగతిన బాధితులకు న్యాయం: సుచరిత

22 Dec, 2020 19:47 IST|Sakshi

విద్యార్థిని సౌమ్య కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి సుచరిత

సాక్షి, గుంటూరు: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిహారం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో బాలిక కుటుంబానికి రూ. 10 లక్షలు, ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. (చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్‌)

మేడికొండూరు మండలం కొర్రపాడులో ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సౌమ్య కుటుంబాన్ని మంగళవారం హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ఎన్ని చట్టాలు చేసిన ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈ కేసుపై దిశ బృందం దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’)

బాధితులకు త్వరితగతిన నాయ్యం చేయాలనే ఉద్దేశ్యంతో దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. వెంటనే శిక్ష పడితే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని ఆమె సూచించారు. అలా చేస్తే వెంటనే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

దిశను బలోపేతం చేస్తూ పోలీసు శాఖకు వెహికల్స్ కేటాయిస్తే.. టీడీపీ నేతలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, పార్టీ గుర్తులంటూ మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో స్మశానాల నుండి వాటర్ ట్యాంక్‌ల వరకూ పసుపు రంగు పులిమారని గుర్తుచేశారు. దిశ చట్టం కనిపించేలా స్టిక్కరింగ్ చేస్తే తప్పుపడుతున్నారని సుచరిత మండిపడ్డారు. మహిళల భద్రతపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ‘దిశ’ చట్టం గురించి ఆలోచిస్తున్నాయని మంత్రి సుచరిత పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు