అక్రమార్కులపై వేటు.. ఆపరేషన్‌ రెవెన్యూ

2 Aug, 2021 11:39 IST|Sakshi

 అక్రమార్కుల ఏరివేత షురూ

ప్రభుత్వ భూములు కాపాడే దిశగా అడుగులు

ప్రైవేట్‌ భూ వివాదాల్లో తలదూర్చి రికార్డులు తారుమారు చేసిన అధికారులు 

ఇప్పటికే ముగ్గురు తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు

కలెక్టర్‌ చర్యలపై సర్వత్రా హర్షం 

జిల్లా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి తిమింగళాలు, భూ బకాసురులు, అక్రమార్కులపై వేటుపడుతోంది. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రతి పనికో రేటు కట్టి రోజువారీ రాబడికి అలవాటుపడ్డారు. అలాంటి కలుపు మొక్కల ఏరివేత యజ్ఞానికి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ చర్యలు అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములు కాపాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామంగా మారింది.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సరిగ్గా రెండు నెలల క్రితం జూన్‌ 2వ తేదీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌ కుమార్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అధికంగా భూ సమస్యలు ఉండటాన్ని గమనించారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలను సీరియస్‌గా తీసుకున్నారు. వాటిలో కొన్నింటిపై విచారణ చేయించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు రెవెన్యూ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే తహసీల్దార్‌ను కూడా సస్పెండ్‌ చేసి తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్న సంకేతాలు పంపారు.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రెండు సోమవారాలు మాత్రమే స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో దాదాపు 400కుపైగా రెవెన్యూ పరమైన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి అధికారులపై చర్యలు చేపట్టే దిశగా కలెక్టర్‌ వేగంగా అడుగులు వేశారు. గత వారంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సున్నితంగా మందలించారు. తప్పుచేసిన వారిని వదలబోనని, అక్రమాలకు పాల్పడిన వారిని ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో చెప్పాలని నిలదీశారు. వారం తిరగకుండానే అమలుచేశారు.

ముగ్గురు తహసీల్దార్లపై సస్పెన్షన్‌ వేటు... 
ప్రభుత్వ భూములను రక్షించలేకపోవడం, ఇతరులకు అక్రమంగా కట్టబెట్టడం లాంటి వాటితో పాటు భూ రికార్డులు తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. వారికి సహకరించిన ఆర్‌ఐలు, వీఆర్వోలను కూడా వదల్లేదు. పొదిలి తహసీల్దార్‌ ఏవీ హనుమంతరావుతో పాటు ఏఆర్‌ఐ శివరామ ప్రసన్న, కంబాలపాడు వీఆర్వో కె.కమలాకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అదేవిధంగా సిలికా సాండ్‌ భూముల లీజ్‌ అంశంలో అక్రమాలకు పాల్పడిన చినగంజాం తహసీల్దార్‌ కె.విజయకుమారిని కూడా సస్పెండ్‌ చేశారు. తాజాగా గత శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్‌ ఎన్‌.సుధాకరరావు, ఆర్‌ఐ పి.వి.శివప్రసాదు, వేములపాడు వీఆర్వో బి.నరసింహం, సీఎస్‌ పురం మండలం పెదగోగులపల్లి వీఆర్వో జే నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఆన్‌లైన్‌ చేసినట్లు వీరందరిపై ఆరోపణలు ఉండగా, విచారణలో రుజువు కావడంతో కలెక్టర్‌ కఠినంగా స్పందించారు.

ప్రత్యేకంగా రెవెన్యూ ‘స్పందన’కు చర్యలు... 
జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు, కబ్జాదారుల బారి నుంచి కాపాడటంతో వారికి సహకరించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు కలెక్టర్‌ ఉపక్రమించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారితో పాటు వారికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులపై విచారణ నిర్వహించి వారందరినీ ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మారుస్తూ రికార్డులు తారుమారు చేస్తున్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కూడా ‘స్పందన’లో కలెక్టర్‌ దృష్టికి వచ్చాయి. వీటన్నింటి పరిష్కారం కోసం గ్రామాల వారీగా భూ రికార్డులు పరిశీలించి ‘రెవెన్యూ స్పందన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల వ్యవధిలో ప్రైవేటు భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.   

ఫిర్యాదుల్లో సగానికిపైగా భూ సమస్యలే...
ఎన్ని స్పందన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని సమస్యలు పరిష్కరించినా.. రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పుల కారణంగా భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని కలెక్టర్‌ గుర్తించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం రెవెన్యూ పరమైన ఫిర్యాదుల్లో భూ సమస్యలు వేలల్లో ఉన్నాయి. 2020 జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు జిల్లా మొత్తం మీద భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై 13,766 అర్జీలు రాగా, 2020 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు 2,583 ఫిర్యాదులు వచ్చాయి. పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని, వాటిని ఆన్‌లైన్‌ చేయాలని, ఒకరి భూమిని మరొకరి పేరుమీద ఆన్‌లైన్‌ చేశారని.. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. 

అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ 
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకునే అధికారులకు అండగా ఉంటా. అధికారుల సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తానో, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలకు కూడా అదేవిధంగా వెనకాడేది లేదు. అన్ని శాఖల అధికారులు దీనిని గుణపాఠంగా తీసుకుని కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు