ఆదుకున్న సర్కార్‌పై నిందలా? 

18 Jul, 2022 03:29 IST|Sakshi

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అర్హతే ప్రామాణికంగా పరిహారం 

ఇప్పుడు పవన్‌ పరామర్శిస్తున్న వారందరికీ ప్రభుత్వం ఇదివరకే సాయం.. వీరిలో ఒక్కరూ పట్టా రైతులు కారు.. 

అయినప్పటికీ కౌలు రైతు కార్డులున్న వారందరికీ రూ.7 లక్షలు.. ఈ కార్డు లేకపోయినా మానవతా దృక్పథంతో వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.లక్ష సాయం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కౌలు రైతుల బలవన్మరణాలను అడ్డుపెట్టుకుని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వినూత్న పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను పెద్ద మనసుతో ఆదుకుంటోంది.

ఈ వాస్తవాలను పక్కనబెట్టి.. మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ రాజకీయ లబ్ధి కోసం పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో 53 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష వంతున పంపిణీ చేశారు. ఈ రైతుల వాస్తవ పరిస్థితి పరిశీలించగా.. వీరిలో అర్హతలున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందజేసింది.

వీరిలో ఒక్కరు కూడా పట్టా రైతు కారు. అయినప్పటికీ పంట సాగు హక్కు పత్రం (క్రాప్‌ కల్టివేషన్‌ రైట్‌ కార్డ్‌ – ప్రత్యేక చట్టం ద్వారా జగన్‌ ప్రభుత్వం ఇచ్చింది) ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకుండా రూ.7 లక్షల చొప్పున సాయం అందించింది. ఆ కార్డులు లేని వారికి కూడా వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ.లక్ష ఇచ్చి ఆదుకుంది. అటు కౌలు రైతు కార్డు లేక, వయసు మీరడంతో ఇటు బీమా వర్తించక ఒకరికి మాత్రమే పరిహారం అందలేదు. ఇలాంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సాయమే చేయలేదని పవన్‌ కల్యాణ్‌ రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇదివరకే ప్రభుత్వ పరిహారం అందుకున్న వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి.  

రూపాయి లంచం లేకుండా రూ.7 లక్షలు  
ఇతని పేరు గుత్తుల వెంకట్రావు (54). వరి పంట సాగుచేసే కౌలు రైతు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు స్వగ్రామం. అప్పుల బాధతో 2021 నవంబర్‌ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య భవాని, కుమారుడు సురేష్, కుమార్తె దేవి ఉన్నారు. ఇతనికి కౌలు రైతు కార్డు ఉండటంతో కుటుంబ సభ్యులు నేరుగా అధికారులను ఆశ్రయించారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. ఈ సాయం భవాని బ్యాంక్‌ ఖాతాలో జమ అయింది.  

దరఖాస్తు చేయగానే పరిహారం 
ఇతని పేరు శీలం త్రిమూర్తులు. కౌలు రైతు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామ పంచాయతీ ప్రత్తిగొంది గ్రామం. ఆరు ఎకరాల్లో వరి సాగు చేసేవాడు. సాగులో నష్టాలు రావడంతో 2021 ఏప్రిల్‌ 12 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో భార్య శీలం సుజాత ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.7 లక్షల పరిహారం ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయింది. ప్రభుత్వం ఆదుకోక పోయుంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతోంది.   

ఎవరి సిఫారసు లేకుండా సాయం 
ఈమె పేరు సుంకర నాగమణి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి. భర్త సుంకర చంద్రయ్య కౌలు రైతు. నాలుగున్నర ఎకరాల పొలం కౌలుకు చేసేవాడు. పంట నష్టపోవడంతో 2020 నవంబర్‌ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు. జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో వలంటీర్‌ ద్వారా విషయాన్ని ఎవరి సిఫారసు లేకుండానే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.7 లక్షలు పరిహారం మంజూరైంది. తమ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకుందని వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

కుటుంబానికి ఆధారం చూపారు.. 
ఈమె సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఉమ్మిడిశెట్టి వెంకటలక్ష్మి. భర్త ఉమ్మిడిశెట్టి వెంకట దుర్గారావు (45) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వర్జీనియా పొగాకు సాగు చేసేవాడు. అప్పులపాలై 2022 ఫిబ్రవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు దొరబాబు, కుమార్తె దేవి, పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న తండ్రి సుబ్బారావు, తల్లి మంగమ్మ పోషణ ఇబ్బందిగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో ప్రభుత్వం రూ.7 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బులు ఆమె బ్యాంక్‌ ఖాతాకు జమ చేశారు.   

కౌలు కార్డు లేకపోయినా సాయం 
డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన పట్టపగలు సురేష్‌ (28) 2021 నవంబర్‌ 30న, ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన కర్రి శ్రీనివాస్‌ (28) 2021 జూలై 11న  అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు కార్డు కోసం భూ యజమాని సంతకం చేయకపోవడంతో వీరికి కౌలు కార్డు మంజూరు కాలేదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా సురేష్‌ భార్య మహాలక్షి, శ్రీనివాస్‌ భార్య కర్రి వీరవేణి బ్యాంకు ఖాతాలకు రూ.లక్ష చొప్పున జమ చేసింది.  

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర పాలెం శివారు చింతాకుల వారి పాలెంకు చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ (65) పంట నష్టంతో పాటు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి కూడా కౌలు రైతు కార్డు లేదు. 65 ఏళ్లు దాటడంతో బీమా వర్తించలేదు.   

మరిన్ని వార్తలు