సలామ్‌ అత్తకు రూ.25 లక్షల పరిహారం

10 Nov, 2020 03:21 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, చిత్రంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

హోంమంత్రి సుచరిత వెల్లడి

పోలీసులు వేధిస్తే ఫిర్యాదు చేయండి.. ప్రాణాలు తీసుకోవద్దు

బాధ్యులందరిపైనా చర్యలు : అంజాద్‌బాషా

సాక్షి, అమరావతి/నంద్యాల: నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్యతో ఆసరా కోల్పోయిన అతని అత్త మాబున్నీసాను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ ఆర్‌ అండ్‌ బీ భవనంలో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తో కలిసి సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సలామ్‌ కుటుంబం ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని, దీనికి పోలీసుల వేధింపులే కారణమంటూ సలామ్‌ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన వెంటనే సీఎం జగన్‌ తనతోను, డీజీపీ సవాంగ్‌తోను మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. తప్పు చేస్తే పోలీసులనూ ఉపేక్షించేది లేదన్నారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, అణగారిన వర్గాలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా పోలీసులు వేధింపులకు పాల్పడితే బాధితులెవరూ ప్రాణాలు తీసుకోవద్దని, తక్షణం ఏపీ పోలీస్‌ సేవా యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేలా త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నం
హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, ఈఎస్‌ఐ స్కామ్‌లో నిందితుడైన అచ్చెన్నాయుడిను అరెస్ట్‌ చేస్తే బీసీలపై కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ముస్లిం, మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. టీడీపీ నేతల అవకాశవాద విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ మాట్లాడుతూ..  ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీసులనూ ఉపేక్షించవద్దని సీఎం వైఎస్‌ జగన్‌ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. 

సలాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా,  ఎమ్మెల్యేలు శిల్పా రవి, హఫీజ్‌ఖాన్‌   

బాధ్యులందరిపైనా చర్యలు 
అబ్దుల్‌ సలామ్‌ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అందరిపైనా ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. సోమవారం ఆయన నంద్యాలలోని అబ్దుల్‌సలామ్‌ ఇంటికి వెళ్లి అతని అత్త, బంధువులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌తో కలిసి పరామర్శించారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. 

నంద్యాల సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కు బెయిల్‌
అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన నంద్యాల సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లకు నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ప్రసన్నలత బెయిల్‌ మంజూరు చేశారు. వారిద్దరిపైనా పోలీసులు ఐపీసీ 323, 324, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, న్యాయమూర్తి దీనిని సెక్షన్‌ 506 (మాటలతో వేధించడం) పరిధిలోకి తీసుకుని వారికి బెయిల్‌ మంజూరు చేశారు. నిందితుల తరఫున కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది వి.రామచంద్రరావు వాదనలు వినిపించారు. 

న్యాయం జరుగుతుందనుకోలేదు
నా అల్లుడు, కుమార్తె, వారి పిల్లల ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తారని అనుకోలేదు. ఈ కేసులో విచారణ కమిటీ ఏర్పాటు చేసి.. సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడం సంతోషంగా ఉంది. నా కుటుంబానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నా వాళ్ల చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్ట వద్దని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా.
    – మాబున్నిసా, అబ్దుల్‌ సలామ్‌ అత్త

సీఎం స్పందించిన తీరు మనోధైర్యం నింపింది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరు ముస్లింలలో మనోధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం విచారణ కమిటీ వేయడమే కాకుండా ఆత్మహత్యకు కారణమైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లను సస్పెండ్‌ చేయడం, వారిని అరెస్ట్‌ చేయడం అభినందించదగ్గ విషయం.    
– అబ్దుల్‌ఖాదిర్, మతపెద్ద, నంద్యాల 

>
మరిన్ని వార్తలు