హిరమండలం ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్‌

15 Sep, 2022 05:10 IST|Sakshi

రూ.176.35 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

గొట్టా బ్యారేజ్‌ జలవిస్తరణ ప్రాంతం నుంచి రోజుకు 1,400 క్యూసెక్కుల ఎత్తిపోత

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2 ఆయకట్టు రైతులకు ముందస్తు ఫలాలను అందించడం.. ఫేజ్‌–1 స్టేజ్‌–2 ఆయకట్టు, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టును స్థిరీకరించడం, ఉద్దానం ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా హిరమండలం ఎత్తిపోతలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడానికి రూ.176.35 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ బుధవారం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

వంశధార నదిలో గొట్టా బ్యారేజ్‌ వద్ద నీటి లభ్యతపై 2007 ఆగస్టులో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మళ్లీ అధ్యయనం చేసింది. ఇందులో గొట్టా బ్యారేజ్‌ వద్ద 105 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో రాష్ట్ర వాటా 52.5 టీఎంసీలు. వంశధార స్టేజ్‌–1, స్టేజ్‌–2ల ద్వారా 34.611 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వాటాలో ఇంకా 17.439 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ నీటిని వాడుకోవడానికి వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2ను జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు.

ఈ ప్రాజెక్టుపై ఒడిశా సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. నేరడి బ్యారేజ్‌ స్థానంలో కాట్రగడ్డ వద్ద సైడ్‌ వియర్‌ను నిర్మించి.. వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ (19.5 టీఎంసీల సామర్థ్యం)కు మళ్లించి.. వంశధార పాత ఆయకట్టు 2,10,510 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను చేపట్టారు. సైడ్‌ వియర్‌ వల్ల ఎనిమిది టీఎంసీలను మాత్రమే హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చు.

గొట్టా బ్యారేజ్‌ నుంచి కుడికాలువ మీదుగా..
నేరడి బ్యారేజ్‌కు వంశధార ట్రిబ్యునల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ.. ట్రిబ్యునల్‌ తీర్పుపై ఒడిశా సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దాన్ని కేంద్రం నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజ్‌ నిర్మాణానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం కోసం భువనేశ్వర్‌ వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌తో దౌత్యం జరిపారు. ఓ వైపు నేరడి బ్యారేజ్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రాజెక్టు ముందస్తు ఫలాలను అందించడం కోసం గొట్టా బ్యారేజ్‌ నుంచి రోజుకు 1,400 క్యూసెక్కుల చొప్పున వందరోజుల్లో 10 నుంచి 14 టీఎంసీలను తరలించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాలని మే 10న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

గొట్టా బ్యారేజ్‌ జలవిస్తరణ ప్రాంతం నుంచి 1,400 క్యూసెక్కులను 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి.. వంశధార కుడికాలువలో 2.4 కిలోమీటర్ల వద్దకు ఎత్తిపోస్తారు. ఈ నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా 2.5 కిలోమీటర్ల పొడవున కుడికాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,265 క్యూసెక్కులకు పెంచుతారు. వందరోజుల్లో 10 నుంచి 12 టీఎంసీలను హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. తద్వారా వంశధారలో వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వంశధార స్టేజ్‌–1, స్టేజ్‌–2ల కింద 2,55,510 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు వంశధార–నాగావళి అనుసంధానం ద్వారా నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న 37 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి ఉద్దానానికి తాగునీటి కోసం 0.712 టీఎంసీలను సరఫరా చేస్తారు.  

మరిన్ని వార్తలు