తక్కువ రేటుకు టమాటా 

21 May, 2022 05:13 IST|Sakshi
విజయవాడ రైతుబజార్‌లో టమాటాల కోసం బారులు తీరిన జనం 

47 రైతు బజార్లలో విక్రయాలు ప్రారంభం 

మిగిలిన రైతుబజార్లలో నేటి నుంచి విక్రయాలు 

సీఎం ఆదేశాల మేరకు అధికారుల చర్యలు 

మార్కెట్‌ ధర కంటే కిలోకు రూ.10 నుంచి రూ.15 తక్కువ 

పొరుగు రాష్ట్రాల నుంచి 70 టన్నుల సేకరణ 

రైతుబజార్లలో బారులు తీరిన వినియోగదారులు

సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బజార్ల ద్వారా సరసమైన ధరకు టమాటా విక్రయాలకు శ్రీకారం చుట్టింది. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా 47 రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. మిగిలిన రైతుబజార్లలో శనివారం నుంచి తక్కువ ధరకు టమాటా విక్రయించనుంది. బహిరంగ మార్కెట్‌ కంటే రూ.10 నుంచి రూ.15 వరకు తక్కువ ధరకే ఇక్కడ అమ్ముతున్నారు. దీంతో రైతు బజార్లలో వినియోగదారులు బారులు తీరారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో టమాటా కిలో రూ.60 నుంచి రూ.85 వరకు ఉంది.

పొరుగు రాష్ట్రంలో కిలో రూ.100కు చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు రైతుబజార్ల ద్వారా సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు టమాటా విక్రయాలు చేపట్టారు. షోలాపూర్‌ నుంచి దిగుమతి చేసుకున్న 15 టన్నుల టమాటాను విశాఖ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో స్థానిక రైతుల వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద కొనుగోలు చేసి స్థానిక రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కనిష్టంగా విజయవాడ రైతుబజార్లలో కిలో రూ.52కు అమ్ముతున్నారు. పల్నాడు, ఏలూరు జిల్లాల్లోనూ స్థానిక రైతుల నుంచి కొన్న టమాటాను అక్కడి రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ తదితర ప్రాంతాల నుంచి మరో 70 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు చేశారు. ఇవి శుక్రవారం రాత్రికి రాష్ట్రానికి రానున్నాయి. వీటిని మిగిలిన జిల్లాల్లోని రైతు బజార్లకు తరలించి శనివారం నుంచి అందుబాటులో ఉంచనున్నారు. 

టమాటా ధరలపై మంత్రి కాకాణి సమీక్ష 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుబజార్ల సీఈవో శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ శాఖ జేడీ రాజశేఖర్, ఇతర అధికారులతో ఫోన్‌లో సమీక్షించారు. ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టమాటా విక్రయించాలని ఆదేశించారు. స్థానికంగా రైతుల వద్ద అందుబాటులో ఉన్న నిల్వలను కొనడంతోపాటు పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి, అక్కడి వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా టమాటాను ప్రతిరోజు కొనాలని చెప్పారు. «ధరలు అదుపులోకి వచ్చే వరకు మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణ, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై నిఘా ఉంచాలని సూచించారు. 

మరిన్ని వార్తలు