వ్యర్థాలను సముద్రంలో వేయట్లేదు

20 Jul, 2022 04:02 IST|Sakshi

రుషికొండ రిసార్టు పనులపై ప్రభుత్వం స్పష్టీకరణ 

వ్యర్థాలను సముద్రంలో ఎలా వేస్తారని ప్రశ్నించిన హైకోర్టు 

అది అవాస్తవమని తెలిపిన ఎస్‌జీపీ 

తొట్లకొండ వద్ద, నిరుపయోగంగా ఉన్న పార్కులో వేస్తున్నామని వెల్లడి 

పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేస్తామని నివేదన 

అంగీకరించిన ధర్మాసనం

తదుపరి విచారణ 27కి వాయిదా

సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ ప్రాజెక్టు వ్యర్థాలను సముద్రంలో వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖాలు చేస్తామన్న ప్రభుత్వ వినతికి హైకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నం.19 పరిధిలోని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులివ్వడంపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

మూర్తియాదవ్‌ తరఫు న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. వ్యర్థాలను బంగాళాఖాతంలో పడేసేందుకు కలెక్టర్‌ అనుమతినిచ్చారని, దీనివల్ల సముద్రం కలుషితమయ్యే ప్రమాదముందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యర్థాలను బంగాళాఖాతంలో ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి కలెక్టర్‌ ఈ అనుమతులు ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ స్పందిస్తూ.. ఎలాంటి వ్యర్థాలనూ సముద్రంలో పారబోయడంలేదని స్పష్టం చేశారు. తొట్లకొండ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో, నిరుపయోగంగా ఉన్న పార్కు స్థలంలో వేస్తున్నామని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు.

మొత్తం 9.88 ఎకరాల్లో కేవలం 5.18 ఎకరాల్లోనే నిర్మాణాలు జరుగుతాయని, మిగిలిన భూమిలో గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడానికి హైకోర్టు అంగీకరించింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. రిసార్ట్‌ కూల్చివేసిన స్థలంలోనే పనులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ల్యాండ్‌ స్కేపింగ్‌ పేరుతో తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. సుమన్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వ కౌంటర్‌కు ఇచ్చిన సమాధానంలో పిటిషనర్లు ఈ విషయాలను పేర్కొనలేదన్నారు.

ఇప్పుడు వాటిని లేవనెత్తడం సరికాదని స్పష్టంచేశారు. పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఈ కేసులో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల తదుపరి విచారణను హైబ్రీడ్‌ విధానంలో చేపట్టాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. తన వాదన కూడా వినాలంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   

మరిన్ని వార్తలు