AP: ఇథనాల్‌ ఉత్పత్తి రెట్టింపు 

23 Oct, 2021 08:23 IST|Sakshi

గ్రీన్‌ ఎనర్జీ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

చక్కెరే కాకుండా మొక్కజొన్న, ఆహార ధాన్యాల నుంచి ఉత్పత్తికీ సమాయత్తం

ఇథనాల్‌ ఉత్పత్తి చేసేడిస్టిలరీలకు ప్రోత్సాహకాలు

వాటి సామర్థ్యం పెంచేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ భవిష్యత్తులో పెట్రో

ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగించాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ, తక్కువ వ్యయంతో ఇంధన వనరులను సముపార్జన లక్ష్యాలుగా ఈ గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్దేశం. ఇందుకోసం తొలిసారిగా ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్‌ ఉత్పత్తికి సమాయత్తమవుతోంది.

ఇప్పటివరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్‌ ద్వారా మాత్రమే ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇకపై మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఈ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సంకల్పించింది. అలాగే, ఇథనాల్‌ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మరోవైపు.. ఔషధ రంగానికే పరిమితమైన ఇథనాల్‌ను ఇకపై పెట్రోలియం ఉత్పత్తుల్లో కూడా విరివిగా ఉపయోగించాలని నిర్ణయించింది.

చెరకు ఉప ఉత్పత్తులకు ప్రోత్సాహం
దేశంలో అవసరానికంటే ఎక్కువగా చక్కెర ఉత్పత్తి అవుతుండడంతో ఆశించిన గిట్టుబాటు ధర లభించడంలేదు. దీంతో చక్కెర దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. అంతేకాక.. ఫ్యాక్టరీల వారీగా క్రషింగ్‌కు కోటా పెట్టి ఎగుమతులకు ఇన్సెంటివ్‌లు ఇస్తోంది. చక్కెర కంటే చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక చెరకు నుంచి వచ్చే మొలాసిస్‌ ద్వారా ఇ నాల్, ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌), ఆర్‌ఎస్‌ (రెక్టిఫైడ్‌ స్పిరిట్‌) వంటి ఉత్పత్తులు వస్తాయి. వీటిలో ఇథనాల్‌ను గ్రీన్‌ ఎనర్జీగా పరిగణిస్తారు.

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. 2030 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఇథనాల్‌ను ఉత్పత్తిచేసే డిస్టిలరీల సామర్థ్యం పెంచుకునేందుకు.. అలాగే, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్‌ ఉత్పత్తి నిమిత్తం కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకోసం ఆర్థికంగా చేయూతనివ్వడమే కాక.. వాటికి వడ్డీ చెల్లింపుపై కనీసం 2–3 ఏళ్ల పాటు మారటోరియం కూడా విధిస్తోంది.

ఇథనాల్‌ ఉత్పత్తి ఎలాగంటే..
చెరకును క్రషింగ్‌ ద్వారా వచ్చిన మొలాసిస్‌ను చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉండే డిస్టిలరీకి తరలిస్తారు. 
అక్కడ ఒక లీటర్‌ మొలాసిస్‌కు మూడు లీటర్ల నీరు కలిపి ఫర్మెంటేçషన్‌ చేస్తారు. అనంతరం డిస్టిలేషన్‌ యూనిట్‌కు పంపిస్తారు. 
అక్కడ ఆవిరిని కండెన్స్‌ చేయగా వచ్చే పదార్థమే ఇథనాల్‌. దీనిని స్టోరేజ్‌ ట్యాంక్‌కు తరలిస్తారు. ఒక టన్ను చెరకు నుంచి 47 కేజీల మొలాసిస్‌ వస్తుంది. టన్ను మొలాసిస్‌ నుంచి 12.5 లీటర్ల ఇథనాల్‌ వస్తుంది. 
ఇక మొలాసిస్‌ నుంచి మూడు రకాలుగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా టన్నుకు సీ మొలాసిస్‌ నుంచి 260 లీటర్లు, బి.మొలాసిస్‌ నుంచి 320 లీటర్లు, షుగర్‌ సిరప్‌ నుంచి 285 లీటర్లు ఇథనాల్‌ను తీస్తారు. 
షుగర్‌ సిరప్‌ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.62.65లు, బి మొలాసిస్‌ నుంచి వచ్చే ఇథనాల్‌కు లీటర్‌కు రూ.57.61లు, సీ మొలాసిస్‌ నుంచి వచ్చే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.45.69లుగా కేంద్రం ధర నిర్ణయించింది. 
వీటిని పెట్రోల్‌ ఉత్పత్తి చేసే ఆయిల్‌ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. 
ఇలా రాష్టంలో 13.75 లక్షల కిలో లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

సామర్థ్యం పెంచేందుకు యత్నిస్తున్నాం
కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహంతో ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. మా ఫ్యాక్టరీలో రోజుకు 48వేల లీటర్ల చొప్పున ఏటా 1.58 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీనిని మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం రూ.95 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. – ఎ. నాగశేషారెడ్డి, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్, సంకిలి, శ్రీకాకుళం జిల్లా

ఇది ఆహ్వానించదగ్గ పరిణామం
రాష్ట్రంలో ఈఐడీతో పాటు సర్వారాయ, ఆంధ్రా, కేసీపీ, ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి కోసం డిస్టిలరీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి యత్నిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. – వడకాని వెంకట్రావు, డైరెక్టర్‌ ఆఫ్‌ షుగర్స్‌ 

మరిన్ని వార్తలు