మధుమేహాన్ని అదుపుచేస్తున్నారు..

16 Mar, 2021 04:31 IST|Sakshi

104 వాహనాల ద్వారా వైద్య పరీక్షలు.. ఉచితంగా మందులు

ఇంటింటి సర్వే ద్వారా రోగుల గుర్తింపు 

ప్రతి పీహెచ్‌సీలో షుగర్‌ పేషెంట్ల కోసం ప్రత్యేక వేళల్లో వైద్యులు 

సాక్షి, అమరావతి: జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా మధుమేహ రోగులను గుర్తించడంతో పాటు వారికి ఉచితంగా మందులు అందిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నీరుగార్చిన 104 మొబైల్‌ మెడికిల్‌ క్లినిక్‌ వ్యవస్థకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఊపిరి పోశారు. గ్రామాలకు పంపి అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించేలా తీర్చిదిద్దారు. మండలానికి ఒకటి చొప్పున 104 మొబైల్‌ క్లినిక్‌ను కేటాయించారు. వీటి ద్వారా నిరంతరం ఇంటింటి సర్వే ద్వారా మధుమేహ పేషెంట్లను గుర్తించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు వీరికి పరీక్షలు నిర్వహించి, మందులిచ్చేందుకు ప్రత్యేకంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు డాక్టర్లను అందుబాటులో ఉంచారు.

74 రకాల మందులు ఉచితంగా
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,28,592 మంది మధుమేహ పేషెంట్లను గుర్తించారు. వీరికి నిత్యం మందులు అందిస్తూ ఇతర జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, మలేరియా, టీబీ, లెప్రసీ నివారణ, బీపీ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ.. తదితర 20 రకాల వైద్య సేవలందిస్తున్నారు. ఈసీజీతో సహా 9 రకాల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో కూడిన 74 రకాల మందులను ఉచితంగా 104ల ద్వారానే అందిస్తున్నారు. రోజుకు ఓ గ్రామ సచివాలయంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం 9,853 గ్రామ సచివాలయాల పరిధిలో 656 మొబైల్‌ మెడికల్‌ క్లినిక్‌లు పనిచేస్తున్నాయి.

జీవన శైలి జబ్బుల నుంచి విముక్తి
ప్రాథమిక దశలోనే జీవన శైలి జబ్బులను గుర్తించి వైద్యం అందించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెంచొచ్చు. పేదలకు ఆర్థిక పరమైన ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి.
– డాక్టర్‌ గీతాప్రసాదిని, సంచాలకులు, ప్రజారోగ్యశాఖ 

మరిన్ని వార్తలు