కథలు.. విజ్ఞాన సోపానాలు

9 Jun, 2022 22:41 IST|Sakshi
పాఠశాలలకు సరఫరా చేసిన కథల పుస్తకాలు  

ప్రభుత్వ పాఠశాలలకు కథల పుస్తకాలు 

సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీకి ఏర్పాట్లు 

జిల్లాలోని పాఠశాలలకు పది పుస్తకాలతో కూడిన సెట్టు 

కడప ఎడ్యుకేషన్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాడు– నేడు ద్వారా వాటి రూపురేఖలు మార్చారు. విద్యార్థుల అభ్యున్నతికి అనుక్షణం కృషి చేస్తున్నారు. విద్యతోపాటు విజ్ఞానం, మానవీయత, సృజనాత్మకతను వెలికి తీసేందుకు తాజాగా విద్యార్థులకు కథల పుస్తకాలను కూడా అందిçస్తున్నారు.అందులోని కథలు మానవీయ విలువలు తెలియజేసేవిధంగా ఉన్నాయని విద్యావేత్తలు తెలిపారు.  

సృజనాత్మకతను పెంచేందుకు దోహదం 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో  విజ్ఞానం, నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కథల పుస్తకాల కాన్సెప్ట్‌ను అమలులోకి తెచ్చింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అదనంగా ఈ కథల పుస్తకాలను అందజేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని భారతీయభాషల కేంద్రీయ సంస్థ(సీఐఐఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుని కథలతో కూడిన పుస్తకాలను రూపొందించారు.

ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన మెటీరియల్‌తో ముద్రించిన 10 రకాల కథల పుస్తకాలను ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లావ్యాప్తంగా 2,762 పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సమగ్రశిక్ష అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2,493 ప్రాథమిక, 269 ప్రాథమికోన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో పాఠశాలకు 10 కథల పుస్తకాలతో కూడిన సెట్‌ను అందించనున్నారు. చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వీటిని అందచేసి చదివించేందుకు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి.

తెలుగు, ఆంగ్లభాషలో ఒక్కో పుస్తకంలో ఒక్కో కథను ముద్రించారు.  విద్యార్థులు తాము చదివిన కథలో ముఖ్యమైన అంశాలను పుస్తకంలోని చివరి పేజీలో ఇచ్చిన ఖాళీల్లో పూరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పుస్తకం ధర రూ. 50 ఉండగా ప్రతి పాఠశాలకు రూ. 5 వందల విలువైన 10 రకాల పుస్తకాలను వైఎస్సార్‌ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం ద్వారా పంపిణీ చేస్తున్నారు.

నీతి నిజాయితీ, విలువలు, క్రమశిక్షణ, సక్రమమైన జీవనం వంటి అంశాలతో కూడిన కథలు ఉన్నాయి. వీటిని చదవడం ద్వారా విద్యార్థుల్లో సత్ప్రవర్తన, నైతిక విలువలు పెంపొందుతాయని విద్యావేత్తల అభిప్రాయం.  

ఆసక్తి రేకెత్తించే కథలు... 
10 రకాల పుస్తకాలతో కూడిన సెట్లో ఉన్న కథల్ని పరిశీలిస్తే పావురం వివేకం, తెలివైన చేప, తొందరపాటు పనికిరాదు, ఊసరవెల్లి అతి తెలివి, యుక్తితో పనులు సాధించవచ్చు. పిల్లిమెడలో గంట, చీమ– పావురం, తెలివైన జింక, పెద్దలమాట చద్దిమూట, మంచి స్నేహితులు వంటి కథలు ఉన్నాయి.  

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 58 గ్రంథాలయాలకు కథల పుస్తకాలను అందజేశారు. ఈ వేసవి సెలవుల్లో లైబ్రరీల్లో నిర్వహించిన వేసవి శిబిరాల్లో పిల్లల చేత చదివించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 100 పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. మిగతా వాటికి కూడా పంపిణీ చేరవస్తున్నారు.  

విద్యార్థులతో చదివించాలి 
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విధంగా విభిన్న అంశాలతో కూడిన కథలను పుస్తకాల్లో చేర్చాం. ప్రతి పాఠశాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న వీటిని విద్యార్థులతో ప్రతిరోజు చదివించాలి.అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.జిల్లా కేంద్రం నుంచి నేరుగా పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం పంపిణీ ప్రారంభించాం.       
– డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి, వైఎస్సార్‌జిల్లా  

మరిన్ని వార్తలు