మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం

6 Oct, 2023 05:00 IST|Sakshi
ఇస్రో డిప్యూటీ డైరెక్టర్‌ రమేష్ బాబును సత్కరిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (విశాఖపట్నం): మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. విశాఖపట్నంలో రెండు రోజులు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.

స్టార్టప్‌ కంపెనీలను స్థాపించే మహిళలకు ప్రోత్సాహకాలతోపాటు వినూత్న ఆలోచనలతో ముందుకువెళ్లేలా సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనకాపల్లిలో 50 ఎకరాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండ్రస్టియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 27 ఎమర్జింగ్‌ ఇన్నోవేషన్స్‌ హబ్‌లను ఎంపిక చేయగా, వాటిలో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉండడం గర్వకారణమన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోపాటు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించగలరని సూచించారు.

ఈ సదస్సులో ఎడ్‌–వెంచర్‌ స్కూల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, యాంటెన్నా వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హెడ్‌ స్టార్ట్‌ నెట్‌వర్క్‌ ఫౌండేషన్, వుయ్‌ ఫౌండర్‌ సర్కిల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంతో ఎంవోయూలు కుదు­ర్చు­కున్నాయి. అనంతరం ఏపీఐఎస్‌ ఈ–మ్యాగజైన్‌ను మంత్రి అమర్‌నాథ్, ఐటీ కార్యదర్శి కోన శశిధర్‌ ఆవిష్కరించారు.

ఈ సదస్సులో ఏపీఐఎస్‌ సీఈవో అనిల్‌కుమార్, ఏపీ, తెలంగాణ ఎస్టీపీఐ డైరెక్టర్‌ సీవీడీ రాంప్రసాద్, అదనపు డైరెక్టర్‌ సురేష్‌ బాతా, నీతి ఆయోగ్‌ సభ్యురాలు యశోధర, నాస్కాం సీఈవో సంజీవ్‌ మల్హోత్రా, సీఐఐ సదరన్‌ రీజియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మి ముక్కవల్లి, స్టార్టప్‌ ఇండియా (న్యూఢిల్లీ) అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖుష్బూ వర్మ, ఎన్‌ఆర్‌డీసీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ శ్రీసుధ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.  

‘స్పేస్‌’ స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలి 
అంతరిక్ష ప్రయోగాలు, ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరుగుతోందని, ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత స్పేస్‌ స్టార్టప్‌లను ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. భీమిలి మండలం దాకమర్రిలో ఉన్న రఘు ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దగల సత్తా సాంకేతిక రంగానికి ఉందన్నారు.

అంతరిక్ష ప్రయోగాలకు ప్రాధాన్యత పెరుగుతున్న కారణంగా ఈ రంగంవైపు పారిశ్రామికవేత్తలు అడుగులు వేయాలన్నారు. భవిష్యత్‌లో స్పేస్‌ టూరిజానికి మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువతకు సహకారం అందిస్తామని చెప్పారు. ఇస్రో డిప్యూటీ డైరెక్టర్‌ జి.రమేష్ బాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ అంతరిక్ష పరిశోధనలపై ఆధారపడి ఉందని అందరూ తెలుసుకోవాలన్నారు. స్టూడెంట్‌ కనెక్ట్‌ కార్యక్రమాల్లో షార్‌ శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పాల్గొంటారన్నారు. యువత చిప్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. రఘు విద్యాసంస్థల చైర్మన్‌ కలిదిండి రఘు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల మ్యాగ్‌జైన్‌ను మంత్రి ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు