AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే.. ఇతర రాష్ట్రాలది ఇదే పరిస్థితి

9 Apr, 2022 18:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మార్చి నెల నుంచి ఎండలు పెరగడంతోనే రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరిగిందని ఇంధన‌ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది. జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతోంది. జెన్ కో ద్వారా సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

డిమాండ్‌కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది. ఏపీలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం. ఇందుకోసం దాదాపు రూ.1250 కోట్లని ఖర్చు చేశాం. బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది. విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు. తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాము. వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి. నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది. తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం అక్కడా ఇదే పరిస్ధితి.

చదవండి: (కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు)

2014-15లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. రోజుకి 30 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. తప్పని పరిస్ధితుల్లోనే రోజుకి గ్రామీణ ప్రాంతాలలో గంట.. పట్టణ ప్రాంతాలలో అరగంట మాత్రమే కోతలు ప్రకటించాం. ఆసుపత్రులకి పూర్తిస్ధాయి సరఫరా కొనసాగించాలని ఆదేశించాం. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించాం. పూర్తి సామర్ద్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ విద్యుత్ కోతలు తాత్కాలికం‌ మాత్రమే. ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని‌ కోరుతున్నాం. నెలాఖరు నుంచి మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గి సాధారణ పరిస్ధితులకి వస్తుంది అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు