చిన్నారికి ఆర్థిక భరోసా: కన్నీరు తుడిచి.. ధైర్యం చెప్పి..

27 May, 2021 09:31 IST|Sakshi
చిన్నారికి ఉత్తర్వులు అందిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ నారాయణ నాయక్‌   

కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి సునంద

రూ.10 లక్షలు నష్టపరిహారం అందిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు     

ఏలూరు (మెట్రో): కోవిడ్‌ కారణంగా ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంటకు చెందిన మూడేళ్ల చిన్నారి మన్నేల్లి సునందకు రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారి సంరక్షకురాలైన అమ్మమ్మ కొత్తపల్లి భద్రమ్మకు ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ ఈ మేరకు ఉత్తర్వులను అందజేశారు. చిన్నారి సునంద తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తుండగా, తండ్రి వీరాస్వామి ఏప్రిల్‌ 22న, తల్లి లక్ష్మి ఏప్రిల్‌ 26న కోవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు.

రూ.10 లక్షలను జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేసి, దానిపై ప్రతి నెలా వచ్చే వడ్డీతో చిన్నారి పోషణ నిమిత్తం వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని, పాపకు 25 ఏళ్లు నిండిన తరువాత నగదు పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిన్నారిని ఓదార్చారు. బాగా చదివించి మంచి ప్రయోజకురాలిని చేయాలని ఆమె అమ్మమ్మను కోరారు. ఎస్పీ కే.నారాయణ నాయక్, జాయింట్‌ కలెక్టర్‌ కే.వెంకటరమణారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ కే.విజయకుమారి, గుండుగొలనుకుంట అంగన్‌వాడీ టీచర్‌ నిమ్మల అనంతలక్ష్మి ఉన్నారు.

చదవండి: శరణ్య.. నువ్వు డాక్టర్‌ కావాలమ్మా!   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు