గ్రామగ్రామాన సు‘రక్షిత’ నీరు 

4 Sep, 2022 05:03 IST|Sakshi

ఏడాదిలో 9.51 లక్షల తాగునీటి శాంపిల్స్‌కు నాణ్యత పరీక్షలు 

సురక్షిత తాగునీరే గ్రామీణులకు అందించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు 

గ్రామాల్లో అన్ని బోర్లు, బావులు, చెరువుల్లో నీటికి ఏడాదిలో రెండు విడతలు పరీక్షలు  

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో నీటికీ రెండుసార్లు పరీక్షలు 

ల్యాబ్‌ల ద్వారా తాగు నీటి పరీక్షల్లో దేశంలో మన రాష్ట్రమే టాప్‌ 

గ్రామాలకే నీటి పరీక్షల కిట్లు  

ఈ ఏడాది హానికర బ్యాక్టీరియానూ గుర్తించే రసాయనాలు సరఫరా  

97.15 శాతం నమూనాల్లో నీరు సురక్షితమైనదని గుర్తింపు 2.85 శాతం నమూనాలోనే కలుషితాలు

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత సురక్షితమైన తాగు నీటిని ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి నిరంతరం పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడైనా కలుషితాలు ఉంటే, ఆ నీటి శుద్ధికి చర్యలు చేపడుతోంది. ఫ్లోరైడ్‌ తదితర కలుషితాల్లేవని నిర్ధారించుకున్నాక ప్రజలు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నారు.

ఇప్పుడు గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్న తాగు నీటిలో 97.15 శాతం స్వచ్ఛమైనదని పరీక్షలు తేటతెల్లం చేస్తున్నాయి. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు మధ్య ఏడాది కాలంలో మొత్తం 9,51,337 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించింది.

గ్రామీణ నీటి  సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఒక విడత అన్ని గ్రామాల్లో బోర్లు, బావులు, చెరువులు, మంచి నీటి సరఫరా పథకాల నీటికి ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది.

అవసరమైతే ఏడాదిలో రెండో సారి కూడా పరీక్షలు చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని బోర్ల నీటికీ కూడా గత ఏడాది రెండు విడతలు కెమికల్, హానికర సూక్ష్మ క్రిముల పరీక్షలు చేసినట్లు ఎస్‌డబ్యూఎస్‌ఎం ప్రాజెక్టు డైరెక్టర్‌ హరే రామనాయక్, చీఫ్‌ కెమిస్ట్‌ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. 

గ్రామాలకే నీటి పరీక్ష కిట్లు 
సాధారణంగా గ్రామాల్లో తాగు నీటి శాంపిల్స్‌ను ఆర్‌డబ్ల్యూఎస్‌కు అనుబంధంగా పనిచేసే 107 ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. గత మూడేళ్లుగా తాగే నీటి నాణ్యతపై అనుమానం కలిగినప్పుడు అక్కడికక్కడే పరీక్షించేందుకు ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఎఫ్‌టీకే కిట్లను సరఫరా చేస్తోంది. వీటితో 8 రకాల ప్రమాదకర రసాయనాలను గుర్తించొచ్చు.

ఒక్కొక్క కిట్‌తో వంద శాంపిల్స్‌ను పరీక్షించొచ్చు. ఈ ఏడాది ఈ కిట్లతో పాటు నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించే హెచ్‌టూఎస్‌ కెమికల్‌ సీసాలను కూడా పంపిణీ చేశారు. మార్చిలోనే 7.50 లక్షల హెచ్‌టూఎస్‌ సీసీలు పంపిణీ చేసినట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వెల్లడించారు. నీటిని పరీక్షించే విధానంపై గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. 

దేశంలో ఏపీనే ఫస్ట్‌ 
గడిచిన ఏడాది కాలంలో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల్లో (ల్యాబ్‌లలో) పరీక్షల నిర్వహణలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 వరకు 6,12,458 శాంపిల్స్‌కు ల్యాబ్‌లలో కెమికల్, బ్యాకీరియా పరీక్షలు చేశారు. గ్రామాల్లోని ఎఫ్‌టీకే కిట్లతో మరో 3,38,879 పరీక్షలు జరిపారు. ఇలా పూర్తిస్థాయి శాస్త్రీయంగా ఉండే ల్యాబ్‌ పరీక్షల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (5.35 లక్షలు), పశ్చి మ బెంగాల్‌ (5.31 లక్షలు),  మధ్య ప్రదేశ్‌ (5.28 లక్షలు) ఉన్నాయి. 

నాణ్యమైన నీరే 
రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీరు ఎంతో సురక్షితమైనదని అన్ని పరీక్షల్లోనూ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఏడాది మొత్తంలో చేసిన పరీక్షల్లో 97.15 శాతం నీరు సురక్షితమైనదని తేలింది. 2.85 శాతం శాంపిల్స్‌లో మాత్రమే కలుషిత కారకాలు గుర్తించారు.

ల్యాబ్‌లో 6.12 లక్షల శాంపిల్స్‌కు పరీక్షలు చేయగా 25,140 నమూనాల్లో కలుషితాలను గుర్తించారు. 3.38 లక్షల ఎఫ్‌టీకే పరీక్షల్లో 3,077 నమూనాల్లో కలుషితాలు ఉన్నట్టు గుర్తించారు. కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని గ్రామీణ నీటిలో అత్యధికంగా కలుషితాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది.   

మరిన్ని వార్తలు