AP News: అనధికార డిపాజిట్లు ఇక జప్తే..!

22 Sep, 2022 06:20 IST|Sakshi

సామాన్యుల సొమ్ముకు రక్షణ కవచం 

విచారణ అధికారికి విస్తృత అధికారాలు 

మార్గదర్శకాలు జారీ చేసిన హోం శాఖ

సాక్షి, అమరావతి: ఆర్థిక మోసాలు, అనధికార డిపాజిట్ల దందాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో అనధికారికంగా, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడాన్ని నిరోధించేందుకు కఠిన నిబంధనలను రూపొందించింది. అనధికారికంగా సేకరించే డిపాజిట్లు, అటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది. తద్వారా అధిక వడ్డీల ఎరకు మోసపోకుండా సామాన్యులకు రక్షణ కవచాన్ని కల్పించింది. అనధికార డిపాజిట్ల సేకరణపై పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

ఆ ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.. 
► ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏ సంస్థగానీ, వ్యక్తులుగానీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు.
► అనధికారికంగా డిపాజిట్లు సేకరించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నియమించే అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి.  
► ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే వాటికి సంబంధించిన వివరాలను ఆ అధికారికి తెలపాలి.  
► తమ బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు వెల్లడించలేకున్నా వాటిని అనధికారిక డిపాజిట్లుగానే పరిగణిస్తారు.  
► అడిగిన వివరాలు చెప్పకుండా పరారైతే సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను న్యాయస్థానానికి నివేదిస్తారు.  
► ఇక అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, అలా సేకరించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులనూ జప్తు చేసే అధికారం ఆ అధికారికి ప్రభుత్వం ఇచ్చింది. ఆస్తుల జప్తునకు సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి సమర్పిస్తారు.  
► స్థానిక పోలీసు అధికారులతో కలసి ఆ వ్యక్తులు, సంస్థల ఆస్తులు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను కూడా ఆ అధికారి పరిశీలించవచ్చు.  

వీటికి మినహాయింపు  
డ్వాక్రా గ్రూపులు, చేనేత, స్వగృహ సహకార సంఘాలు, గుర్తింపు పొందిన మతపరమైన సంస్థలకు మినహాయింపు నిచ్చారు. ఆ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు ఏడాదికి గరిష్టంగా రూ. 10 వేల వరకు చేసే డిపాజిట్లను అనధికారిక డిపాజిట్లుగా పరిగణించరు. మతపరమైన సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు, వేద పాఠశాలలు, గోశాలల నిర్వహణకు సేకరించే డిపాజిట్లకు కూడా ప్రభుత్వం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది.   

డిపాజిట్‌దారుల సొమ్ముకు రక్షణ 
సామాన్యులు అవగాహన లేకుండా అనధికారిక డిపాజిట్లు చేస్తే.. వారి సొమ్ముకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించింది. అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, ఆ సంస్థల ఆస్తులను వెంటనే జప్తు చేస్తారు. ఆ విధంగా జప్తు చేసిన నగదు, ఆస్తులను ఇతరులకుగానీ ఇతర సంస్థలకుగానీ బదిలీ చేయడానికి వీల్లేదు. కేసు పరిష్కారమైన తరువాత డిపాజిటర్లకు వారి డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ తప్పనిసరి 
రాష్ట్రంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సెక్యూరిటీ ఏజెన్సీలు పాటించాల్సిన నిబంధనలు, సెక్యూరిటీ సిబ్బంది నియామక అర్హతలు, వారికి ఇవ్వాల్సిన కనీస శిక్షణ ప్రమాణాలను నిర్దేశించింది. విధివిధానాలను పాటించే ఏజెన్సీలకే లైసెన్సులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.   

మరిన్ని వార్తలు