విద్యార్థుల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం

7 Mar, 2021 03:55 IST|Sakshi

11.37 లక్షల మంది విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలు

పాజిటివిటీ రేటు 0.13% మాత్రమే.. 

అన్ని జాగ్రత్తలతో తరగతుల నిర్వహణ  

సాక్షి, అమరావతి: విద్యార్థులు, బోధన సిబ్బంది ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. విద్యా సంస్థలకు వచ్చే విద్యార్థులకు, బోధన సిబ్బందికి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుని తరగతులు నిర్వహిస్తుండటంతో ఈ పరీక్షల్లో పాజిటివిటీ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఇప్పటివరకు 11,37,706 మంది విద్యార్థులకు టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 0.13 శాతంగా నమోదైంది. అలాగే 1,26,724 మంది బోధన సిబ్బందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 0.37 శాతంగా నమోదైంది.

కరోనా సోకిన వారిని తీవ్రత ఆధారంగా.. హోం ఐసోలేషన్‌ లేదంటే ఆస్పత్రుల్లో వైద్యమందించేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది. అలాగే ఉపాధ్యాయుల ద్వారా ప్రతి రోజూ కోవిడ్‌–19 నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులను తీసుకువచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయిస్తున్నారు. బస్సుల్లో మాస్కులు ధరింపచేయడం, మాస్కులు లేకుంటే బస్సుల్లోకి అనుమతించకపోవడం, స్కూలు ఆవరణ మొత్తం రోజూ శానిటైజ్‌ చేయించడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాజిటివిటీ రేటు తక్కువగా నమోదవుతోంది. 

మరిన్ని వార్తలు