ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు తీపి కబురు

17 Apr, 2021 04:14 IST|Sakshi

వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని సర్కారు ఆదేశం 

2017–19 మధ్య కాలంలో రూ.146.04 కోట్లు బకాయి పెట్టిన చంద్రబాబు

సాక్షి, అమరావతి: ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు సర్కారు వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. ఆ మొత్తాలని చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను గతంలోనే ఆదేశించారు. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరిపిన ఆర్టీసీ అధికారులు చివరి రెండు విడతల బకాయిలను కూడా ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.  

సీనియార్టీ ప్రాతిపదికన చెల్లింపులు 
చంద్రబాబు ప్రభుత్వం 2017–19 మధ్యలో రిటైరైన 5,027మంది ఆర్టీసీ ఉద్యోగులకు రూ.146.4 కోట్ల మేర వేతన బకాయిలు, ఆర్జిత సెలవులు, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో సీనియారిటీ ప్రాతిపదికన ఆ బకాయిలు చెల్లింపు ప్రక్రియ చేపట్టింది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2017 సెపె్టంబర్‌ 30 మధ్యలో రిటైరైన 1,653 మంది బకాయిలు రూ.33.77 కోట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 27న చెల్లించారు. 2017 అక్టోబరు 1 నుంచి 2018 మార్చి 31 మధ్యలో రిటైరైన 1,069 మంది ఉద్యోగులకు రూ.28.65 కోట్లను ఈ ఏడాది మార్చి 25న చెల్లించారు. మిగిలిన రెండు విడతలను ఈ నెల 27, 30 తేదీల్లో చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 2018 ఏప్రిల్‌ 1  నుంచి 2018, సెపె్టంబర్‌ 30 మధ్యలో రిటైరైన 1,643 మందికి బకాయిల మొత్తం రూ.55.53 కోట్లు ఈ నెల 27న చెల్లిస్తారు. 2018 అక్టోబర్‌ 1 నుంచి 2019 ఫిబ్రవరి 28న మధ్యలో రిటైరైన 662 మందికి బకాయిల మొత్తం రూ.28.08 కోట్లు ఈ నెల 30న చెల్లిస్తారు. 

ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం 
ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు నాలుగు విడతల్లో మొత్తం రూ.146.04 కోట్లు చెల్లించే ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు 2013, 2014 సంవత్సరాలకు చెందిన ఆర్జిత సెలవుల మొత్తం రూ.4 5కోట్లు కూడా ఇప్పటికే చెల్లించాం. 
– ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ   

మరిన్ని వార్తలు