మూడు డీఏలకూ ఓకే

25 Oct, 2020 02:44 IST|Sakshi

దసరా కానుక.. ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

జనవరి జీతంతో తొలి డీఏ చెల్లింపు.. ఖజానాపై ఏటా రూ.3,802 కోట్ల భారం

బకాయిలు జీపీఎఫ్‌లో జమకు మరో రూ.9,504 కోట్లు

4.49 లక్షల మంది ఉద్యోగులకు, 3.57 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి పెండింగ్‌ డీఏలను మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి మొత్తం మూడు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. మూడు డీఏల మంజూరు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.3,802 కోట్లు భారం పడుతుంది. అలాగే బకాయిలను ఉద్యోగుల భవిష్య నిధి (జీపీఎఫ్‌)కు జమ చేయడానికి మరో రూ.9,504 కోట్లు వ్యయం కానుంది. దీనివల్ల 4,49,000 ఉద్యోగులకు, 3,57,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.

– జూలై 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏను వచ్చే ఏడాది జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలను ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.
– జనవరి 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ వచ్చే ఏడాది జూలై వేతనాలతో నగదు రూపంలో ఆగస్టు 1న ఇస్తారు. డీఏ బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.
– జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ 2022 జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో జీపీఎఫ్‌కు జమ చేస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.

సీఎం వైఎస్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి, ఏపీ మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సైతం గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మరో డీఏను ఒకేసారి మంజూరు చేస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు