పాపికొండల పర్యాటకానికి గ్రీన్ ‌సిగ్నల్‌

13 Apr, 2021 12:55 IST|Sakshi
పాపికొండల్లో బోట్‌పై షికారు చేస్తున్న పర్యాటకులు (ఫైల్‌) 

15 నుంచి పునఃప్రారంభం

గతంలో కచ్చులూరు లాంచీ ప్రమాదంతో నిలిచిన టూరిజం

తిరిగి ప్రారంభిస్తుండడంపై సర్వత్రా హర్షం

వీఆర్‌పురం: అలలతో సయ్యాటలాడుతూ.. ఆ తుంపర్లలో హాయిగా తడుస్తూ.. రివ్వున తాకే చల్లని గాలులలకు సేద తీరుతూ.. ఆనందంగా కేరింతలు కొడుతూ.. తల్లి గోదావరి ఒడిలో ప్రయాణించే రోజులు మళ్లీ వచ్చేశాయి. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరో రెండు రోజుల్లోనే ఇది ప్రారంభం కానుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర కిందట దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో దాదాపు 50 మంది జలసమాధి అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘోర ప్రమాదం అనంతరం పాపికొండల పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. గోదావరిలో అన్ని మోటార్‌ బోట్లనూ నిషేధించింది. పర్యాటకుల ప్రాణాలకు భద్రతనిచ్చే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్న తరువాతే నదీ పర్యాటకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది.

గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు నడిచేవి. అలాగే భద్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు రాకపోకలు సాగించేవి. కాకినాడ పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఇప్పటి వరకూ ఒక్క ప్రైవేటు లగ్జరీ బోటుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యాన హరిత ఏసీ లగ్జరీ బోటుకు మాత్రం పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. ఈ బోటుతోనే పాపికొండల పర్యాటకం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. మొత్తంమీద అనేక జాగ్రత్తల నడుమ పాపికొండల పర్యాటకాన్ని తిరిగి ప్రారంభిస్తుండడంపై అటు పర్యాటకులు, ఇటు ఈ పర్యాటకంపై ఆధారపడిన కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేలాదిగా పర్యాటకులు 
ఏజెన్సీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవున గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండల అందాలను, ఇక్కడి అటవీ ప్రాంతాన్ని, కొండల నడుమ వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి సోయగాన్ని బోట్లలో ప్రయాణిస్తూ వీక్షించేందుకు ఏటా దేశవ్యాప్తంగా వేలాదిగా పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివచ్చేవారు. ఫలితంగా పాపికొండల పర్యాటకం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. దీంతో ఇక్కడి గ్రామాల్లో నివసించే కొండరెడ్డి గిరిజన ప్రజలతో పాటు సమీప గ్రామాల గిరిజనేతరులకు కూడా ఇది ఉపాధి మార్గంగా మారింది.

వీఆర్‌పురం మండలం పోచవరం బోట్‌ పాయింట్‌ నుంచి రోజు సుమారు 300 మంది, సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. వీరు 15 నుంచి 20 బోట్లలో పాపికొండలు వెళ్లేవారు. పర్యాటకం నిలిచిపోయే సమయానికి బోటుకు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.400 చొప్పున టిక్కెట్టు ఉండేది. ఏసీ బోట్లకు మరో రూ.100 అదనంగా వసూలు చేసేవారు. టిక్కెట్టు చార్జీలోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా కలిపి ఉండేవి. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు, పర్యాటకులు 75 కిలోమీటర్ల దూరంలోని పోచవరం బోట్‌ పాయింట్‌కు రోడ్డు మార్గంలో చేరుకొనేవారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్‌ ద్వారా పాపికొండల సందర్శనకు వెళ్లేవారు. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా వైపు పేరంటపల్లిలో ఎత్తయిన కొండల నడుమ, గలగల పారే సెలయేటిని ఆనుకుని ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకుని భక్తిపరవశులయ్యేవారు. అనంతరం తిరుగుపయనమయ్యేవారు.

వేల కుటుంబాలకు ఉపాధి 
పాపికొండల పర్యాటకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. భద్రాచలంలో పర్యాటకులను తరలించే మినీ వ్యాన్ల డ్రైవర్లు మొదలుకొని అక్కడి టిక్కెట్టు కౌంటర్లలో పని చేసే వర్కర్లు, లాడ్జీల నిర్వాహకులు, మార్గం మధ్యలోని కూనవరం, వీఆర్‌ పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలు చేసేవారు పాపికొండలు పర్యాటకులపై ఆధారపడి జీవించేవారు. అలాగే పోచవరం బోట్‌ పాయింట్‌ వద్ద వ్యాపారులు, బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, బోట్లలో పర్యాటకులకు వినోదాన్ని పంచే డ్యాన్సర్లు, పేరంటపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు, కొల్లూరు ఇసుక తిన్నెల్లో బొంగు చికెన్‌ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారు 5 వేల మందికి పైగా ప్రజలు ఈ పర్యాటకాన్ని నమ్ముకొని జీవనం సాగించేవారు. ఇన్నాళ్లుగా పాపికొండల విహార యాత్రలు నిలిచిపోవడంతో వారందరి జీవనానికి బ్రేకులు పడ్డాయి. పాపికొండల పర్యాటకం పూర్వ వైభవం సంతరించుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

లాంచీకి కాపలా కాస్తున్నా 
అసలు నేను లాంచీ డ్రైవర్‌ను. పాపికొండలకు బోట్లు నిలిచిపోవడంతో బోట్లలో సిబ్బందిని కుదించారు. గతిలేక నేను నడిపిన లాంచీకి ఇప్పుడు కాపలాదారుగా ఉంటున్నాను. పాపికొండల పర్యాటకం మళ్లీ ప్రారంభం కాబోతోందంటే ఆనందంగా ఉంది. 
– పి.సూర్యనారాయణ, లాంచీ డ్రైవర్‌ 

ఆశలు చిగురిస్తున్నాయి 
పర్యాటకంపై ఆధారపడి ఎంతోమంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఉపాధి పొందేవి. పర్యాటకం నిలిచిపోవడంతో పూట గడవని స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని మాలాంటి కొండరెడ్డి కుటుంబాల వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వెదురు కళాకృతులు విక్రయించి జీవనం సాగించేవారు. ఇప్పుడు చేద్దామంటే పని దొరకక పూట గడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మాలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
– కోపాల రాంబాబురెడ్డి, వెదురు కళాకృతుల విక్రయదారు, పేరంటపల్లి

ఆశగా ఎదురుచూస్తున్నాం 
బోట్‌లో గుమస్తాలుగా చేసే మాలాంటి ఎంతో మందికి బోట్‌ యూనియన్‌ నుంచి నెలవారీ జీతాలు వచ్చేవి. పర్యాటకం నిలిచిపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులకైనా పర్యాటకం మొదలవుతుందని, వేరే పనికి వెళ్లకుండా ఆశగా ఎదురు చూస్తున్నాం. 
– నందికొండ నరసింహరావు, బోట్‌ గుమస్తా 

పర్యాటకం ప్రారంభమైతేనే.. 
పర్యాటకం నిలిచిపోవడంతో కనీసం బోట్లలో పని చేసే వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పర్యాటకం ప్రారంభమైతేనే ఈ గండం నుంచి గట్టెక్కగలుగుతాం. పోచవరం బోట్‌ పాయింట్‌ వద్ద పర్యాటక బోట్లను పోర్ట్‌ అధికారులు పలుమార్లు తనిఖీ చేశారు. కొన్ని బోట్లకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల మంజూరుకు సిఫారసు కూడా చేశారు. త్వరలోనే పర్యాటకం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం. 
మామిడి వెంకటరమణ, బోట్‌ యజమాని
చదవండి:
చంద్రబాబు సభ: ఆ రాయి ఎలా వచ్చింది?
మందుబాబులు నాకే ఓటు వేయాలి

మరిన్ని వార్తలు