రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ 

25 Mar, 2021 03:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైన రూ.3 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మౌలిక వసతుల కల్పన కింద రోడ్లు, మురుగు నీటిపారుదల, నీటి సరఫరా, జాతీయ రహదారికి రాజధాని రోడ్లను అనుసంధానం చేసే పనులు, భూసమీకరణలో రైతులకివ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు రూ.3 వేల కోట్లు అవసరమని ఏఎంఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు మూడు బ్యాంకులు అంగీకరించగా దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సిఉంది. నిబంధనల ప్రకారం షరతులకు లోబడి గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు.  

రాజధాని పనుల కోసం సాంకేతిక కమిటీ 
రాజధానిలో పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు అవసరమైన సిఫారసులు, సూచనలు చేసేందుకు తొమ్మిది మంది సభ్యులతో ప్రభుత్వం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ చైర్మన్‌గా, పబ్లిక్‌ హెల్త్, ఆర్‌ అండ్‌ బీ, ఏపీసీపీడీసీఎల్, ఈఎన్‌సీలు, సీఈలు ఇతర అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది. 

మరిన్ని వార్తలు