Andhra Pradesh: వ్యవ'సాయమే' లక్ష్యంగా..

16 May, 2021 03:55 IST|Sakshi

2021–22లో రైతులకు రూ.1,44,927 కోట్ల రుణాలు! 

ముందస్తు వ్యవసాయ రుణ ప్రణాళిక సిద్ధం చేయించిన రాష్ట్ర ప్రభుత్వం 

పంట రుణాలుగా రూ.1,13,122 కోట్లు 

వ్యవసాయ టర్మ్‌ రుణాలుగా రూ.31,805 కోట్లు 

ఈ ఖరీఫ్‌లో 92.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా 

వైఎస్సార్‌ రైతు భరోసాతో ఇప్పటికే రైతులకు పెట్టుబడి నిమిత్తం రూ.3,928 కోట్లు అందించిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ముందస్తు వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేయించింది. అధికారం చేపట్టిన నాటినుంచీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభ సమయంలోనూ రైతుల కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి అండగా నిలిచారు.

మళ్లీ కోవిడ్‌ ఉధృతి పెరిగినప్పటికీ ఆ ప్రభావం వ్యవసాయ రంగంపైన, రైతులపైన పడకుండా రానున్న ఖరీఫ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో.. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2021–22) సంబంధించి వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1,44,927 కోట్లుగా అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఇందులో పంట రుణాలు రూ.1,13,122 కోట్లు కాగా.. వ్యవసాయ టర్మ్‌ రుణాలు రూ.31,805 కోట్లుగా ఉన్నాయి.  

92.45 లక్షల ఎకరాల్లో సాగు 
రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు కొరత రాకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తోంది. మరోవైపు సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌లో అంచనాలను మించి 92.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అంచనా వేసింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు సైతం ఉన్నాయి.

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామాల్లోనే సరి్టఫైడ్‌ నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, ఎరువులతో పాటు రైతులకు  ఏది కావాలన్నా ప్రభుత్వమే సమకూరుస్తుడంతో ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

సాగుకు అండగా పెట్టుబడి సాయం 
వరుసగా మూడో ఏడాది కూడా రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద ఈ నెల 13వ తేదీన 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించింది.  దీంతో ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా అందించిన రైతు భరోసా సాయంతో కలిపి ఇప్పటివరకు రైతులకు రూ.17,029 కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. 

సబ్సిడీపై విత్తనాలు 
సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రానున్న ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. వివిధ రకాల పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.174.02 కోట్లను సబ్సిడీగా భరించనుంది. గతంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తీసుకునేందుకు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. గత ఖరీఫ్‌ నుంచి రైతులకు  ఏం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ అసిస్టెంట్లు, ఉద్యాన అసిస్టెంట్లు, సెరి కల్చర్‌ అసిస్టెంట్లు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. 

కొరత లేకుండా ఎరువులు 
ఈ ఖరీఫ్‌లో అన్నిరకాల ఎరువులు కలిపి 20.70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచారు. నాలుగంచెల్లో ఎరువులను నిల్వ ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు, మండల కేంద్రాలు, సబ్‌ డివిజన్‌ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎరువులను నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టారు. జూన్‌ తొలి వారం నుంచి రైతులందరికీ ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే ముందస్తుగా టెస్ట్‌ చేసి సర్టిఫైడ్‌ క్వాలిటీ పురుగు మందులను కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉన్న ఊరిలోనే రైతులకు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. అలాగే రైతులకు అవసరమైన పంట రుణాలను కూడా బ్యాంకుల నుంచి ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది.  ఈ–పంట పోర్టల్‌లో నమోదైన రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలను అందజేస్తాయి,   

మరిన్ని వార్తలు