రైతులకూ రాయితీ

4 Aug, 2020 04:47 IST|Sakshi

యంత్ర పరికరాలపై ప్రభుత్వం ఉత్తర్వులు

పరికరం విలువలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.75 వేల రాయితీ

ఇందుకోసం ఆన్‌లైన్‌లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి

లబ్ధిదారుడు పరికరం విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి

40 శాతం రుణం బ్యాంక్, 50 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తాయి

సాక్షి, అమరావతి: అన్నదాతలకు కూడా వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఉత్పత్తి సంఘాలు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైతులకు కూడా రాయితీపై పరికరాలను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.

మార్గదర్శకాలు..
► సన్నకారు, చిన్నకారు రైతులకు యంత్ర పరికరం విలువలో 50% రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. అది గరిష్టంగా రూ.75 వేలకు మించకుండా ఉండాలి. 
► లబ్ధిదారుడు పరికరం విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి. మిగిలిన 40 శాతం మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. 
► అవసరమైన పరికరాల కోసం  రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
► పరికరం ఎంపిక చేసుకునే సమ యంలో గ్రామ స్థాయి అధికారులు, డీలర్ల ఒత్తిడి రైతుపై ఉండకూడదు.
► అధికారులెవరూ పరికరాల సంస్థలను రైతులకు సిఫారసు చేయకూడదు. అలా చేస్తే చర్యలు ఉంటాయి.
► జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఎంపికైనవారి పేర్లను ఆర్బీకేలలో ఉంచుతారు.
► రాయితీగా ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం కంపెనీ డీలర్ల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. రాయితీ చెల్లించే ముందు రైతు పరికరం పట్ల సంతృప్తి చెందితేనే అధికారులు నగదు చెల్లింపులకు సిఫారసు చేస్తారు.
► ‘ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత’ పద్ధతిలో రైతులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వార్తలు