పద్ధతులు పాటిస్తే.. ‘మద్దతు’!

23 Nov, 2020 21:16 IST|Sakshi

అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్‌పీ ఇచ్చి కొనుగోలు చేయాలని సర్కార్‌ సంకల్పం

ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌

రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ

దళారుల ప్రమేయం, రైతులకు రవాణా ఖర్చు లేకుండా కొనుగోళ్లు

సాక్షి, అమరావతి: 'వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూడాలి. ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ ఏర్పడాలి. తద్వారా మెరుగైన ధర రావడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి. పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర రావాలి' అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ నడుం బిగించింది. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఇచ్చి కొనుగోలు చేసేలా సంకల్పించింది. ప్రస్తుతం వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన ప్రమాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల్లో అవగాహన కల్పించేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ఖరీఫ్‌లో చెప్పిన దానికంటే మిన్నగా రూ.3,300 కోట్లతో జొన్న, మొక్కజొన్న, అరటి, ఉల్లి, పసుపు తదితర పంటలను, రూ.11,500 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 

రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఇలా.. 
మద్దతు ధర రావాలంటే రైతులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా ఇ-పంటలో తమ పంటను నమోదు చేసుకుని ఉండాలి. ఆ తర్వాత తమ పంట ఉత్పత్తులకు తప్పనిసరిగా నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలి. ఈ మేరకు ప్రతి ఆర్బీకే వద్ద నాణ్యతా ప్రమాణాలున్న పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. నిర్దేశిత ప్రమాణాలున్న వరి ధాన్యాన్ని పొలాల వద్దే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. 
ధాన్యాన్ని గ్రేడ్‌-ఏ, కామన్‌ గ్రేడ్‌గా విభజించి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యంలో 17 శాతం తేమ, కేళీలు 6 శాతం, వడలిపోయిన, కుచించుకుపోయిన, అపరిపక్వ గింజలు 3 శాతం, రంగు వెలిసిన, మొలకెత్తిన, పురుగుపట్టినవి 5 శాతం వరకు, దుమ్మూ, ధూళి ఒక శాతం వరకు మించకుండా ఉండాలి. ధాన్యం శుభ్రంగా, పొడిగా, ఒకే రంగు, పరిమాణం ఉండి, బూజు, పురుగు పట్టకుండా.. ఎటువంటి చెడు వాసన లేకుండా ఉంటే వాటిని ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తారు. 
వేరుశనగలో తేమ 8 శాతం వరకు ఉండొచ్చు. కెర్నల్స్‌ (గింజలు), పాడ్స్‌ (కాయలు) 65 నుంచి 70 శాతానికి మించి ఉండాలి. 4 శాతం వరకు ఇతర రకాల కాయలు, 4 శాతం వడలిపోయిన, పక్వానికి రాని గింజలు, 2 శాతం వరకు పాడైపోయిన గింజలు, దుమ్మూ ధూళి ఉన్నవాటిని 2 శాతం వరకు అనుమతి ఇస్తారు. 
మొక్కజొన్నలో గింజలు పొడిగా, దృఢంగా, శుభ్రంగా, పక్వానికి వచ్చి ఉండటంతోపాటు ఆకారం, రంగు ఒకేలా ఉండాలి. పురుగు, బూజు పట్టకూడదు. చెడు వాసన రాకూడదు. 14 శాతం వరకు తేమ ఉండవచ్చు. 4.5 శాతం వరకు రంగు వెలిసిన గింజల్ని అనుమతిస్తారు. 3 శాతం వరకు పక్వానికి రాని గింజలున్నా కొంటారు.
పత్తిని బాగా ఆరబెట్టి శుభ్రం చేసుకుని తీసుకురావాలి. తేమ 8 శాతానికి మించకూడదు. అంతకుమించితే ధర తగ్గుతుంది. అది కూడా 12 శాతం వరకే అనుమతి ఇస్తారు. అంతకుమించి ఉంటే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 మిల్లీమీటర్ల నుంచి 30.50 మిల్లీమీటర్ల వరకు ఉండాలి. మైక్రోనెయిర్‌ విలువ 3.5 నుంచి 4.5 వరకు ఉండాలి. తడిసిన పత్తిని కొనరు. దుమ్మూ, ధూళి, చెత్తా చెదారం, గుడ్డిపత్తి, రంగుమారిన, పురుగుపట్టిన పత్తి కాయలు ఉండకూడదు. 

సర్కారు చర్యలివే..
అన్నదాతలకు దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా ఈ ఖరీఫ్‌ నుంచి రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రభుత్వం పంటలను కొనుగోలు చేస్తోంది. అందుకే ప్రతి ఆర్బీకేని కొనుగోలు కేంద్రంగా ప్రకటించింది. గిట్టుబాటు ధరల కోసం తొలిసారిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని కళ్లాల వద్దే కొనుగోలు చేసి ఆ తర్వాత పది రోజుల్లోనే చెల్లింపులు చేస్తోంది.

మరిన్ని వార్తలు