‘టమాటా’ రైతుకు అండగా సర్కార్‌

25 Apr, 2021 04:47 IST|Sakshi

వేలం పాటలో పాల్గొంటున్నమార్కెటింగ్‌ శాఖ

గిట్టుబాటు ధర లభించక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని ప్రభుత్వం నిర్ణయం

టమాటా ధరలను పర్యవేక్షించేందుకు యార్డుల్లో ప్రత్యేకాధికారులు 

రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: మంచి ధర లభించక కుదేలవుతున్న టమాటా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గిట్టుబాటు ధరలు దక్కక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ఉద్దేశంతో టమాటా ధరలు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ రంగంలోకి దిగి ధర తక్కువగా ఉన్నచోట మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద టమాటా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోంది. ఇందులో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌ యార్డులో నాణ్యతను బట్టి కిలో రూ.4 నుంచి రూ.6 చొప్పున ఐదు మెట్రిక్‌ టన్నుల టమాటాను కొనుగోలు చేసింది. ఇలా కొన్న టమాలను రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

రాయలసీమ నుంచే అధిక దిగుబడి
రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,030, అనంతపురం జిల్లాలో 19,340, కర్నూలు జిల్లాలో 3,203, విశాఖపట్నం జిల్లాలో 1,260 హెక్టార్లలో, మిగిలిన జిల్లాల్లో వెయ్యిలోపు హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా 22,16,540 టన్నుల దిగుబడి వస్తుండగా.. ఇందులో రాయలసీమలోని మూడు జిల్లాల నుంచే 20,36,628 టన్నుల దిగుబడి వస్తోంది. రోజూ చిత్తూరులో 300–400 టన్నులు, అనంతపురంలో 80–100 టన్నులు, కర్నూలులో 80 టన్నులు, కడపలో 8–10 టన్నులు, విశాఖలో 30–50 టన్నుల టమాటా మార్కెట్‌కు వస్తోంది. చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.1,000 ధర పలుకుతోంది. 

వ్యాపారులతో కలిసి కొనుగోలు
రాయలసీమ టమాటాకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఏప్రిల్‌ నుంచి సగానికి పైగా టమాటా ఈ రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఆ మేరకు రేట్లు కూడా పెరుగుతాయి. కానీ కరోనా నేపథ్యంలో ఎగుమతుల్లేక స్థానిక మార్కెట్‌లో రేటు ఏమాత్రం పెరగలేదు. ఎక్కువగా దిగుబడి వచ్చే చిత్తూరులోని కొన్ని మార్కెట్‌ యార్డుల్లో క్వింటాల్‌కు రూ.400కు మించి పలకడం లేదు. ఈ ధర మరింత పతనమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో సర్కార్‌ రంగంలోకి దిగింది. ధర పతనమైన మార్కెట్‌ యార్డుల్లో వ్యాపారులతో కలిసి మార్కెటింగ్‌ శాఖ ఈ–నామ్‌ (వేలం పాట)లో పాల్గొని టమాటా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 

మంచి ధర లభించేలా సర్కార్‌ చర్యలు
ధర తక్కువగా ఉన్న ఇతర మార్కెట్‌ యార్డుల్లో కూడా ఇదే తరహాలో సర్కార్‌ జోక్యం చేసుకోనుంది. వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొని పోటీని పెంచడం ద్వారా రైతుకు మంచి ధర వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన మార్కెట్‌ యార్డుల్లో కూడా రోజూ టమాటా ధరలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తోంది. కనీసం కిలోకి రూ.5 తక్కువ కాకుండా రైతుకు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. ఇలా కొనుగోలు చేసిన టమాటాను స్థానిక రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.  

మరిన్ని వార్తలు