‘మూడో వేవ్‌’ నిరోధానికి ముందస్తు వ్యూహం

21 Jul, 2021 02:40 IST|Sakshi

26 ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు

పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో నాన్‌ ఐసీయూ పడకలు

ఎమర్జెన్సీ కోవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ కింద కార్యాచరణ

యుద్ధప్రాతిపదికన చర్యలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మూడో వేవ్‌ కరోనా వార్తల నేపథ్యంలో ముందస్తు వ్యూహం అమలు చేయనుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కోవిడ్‌ రెస్పాన్స్‌ ప్లానింగ్‌ పేరుతో నిధులు కేటాయించనున్నాయి. ఏపీకి కేటాయించిన రూ.696 కోట్ల నిధుల్లో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించనున్నాయి. ఈ నిధులతో 14 జిల్లా ఆస్పత్రుల్లో, 12 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రూ.101.14 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఒక్కో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్‌లో 42 పడకలుంటాయి. అలాగే రాష్ట్రంలోని మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో  40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం రూ.188.72 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తారు.

పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీ వరకు..
► ప్రతి పీహెచ్‌సీలోనూ 6 పడకల నాన్‌ ఐసీయూ యూనిట్‌ను, ప్రతి సామాజిక  ఆరోగ్యకేంద్రంలో 20 పడకల నాన్‌ ఐసీయూ యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం  రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
► 1,145 పీహెచ్‌సీల్లో, 208 సీహెచ్‌సీల్లో  ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
► కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు.
► 100 పడకల ఆస్పత్రికి రూ.7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది.
► వీటిని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. 
► ప్రతి ఆస్పత్రిలోనూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేస్తారు.
► రూ.8.38 కోట్ల వ్యయంతో హబ్స్‌ అండ్‌ స్పోక్స్‌ ద్వారా టెలీమెడిసిన్‌ను బలోపేతం చేస్తారు.
► ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్‌ స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి  కేటాయిస్తారు.
► కోటి ఆర్టీపీసీఆర్‌ టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు.
► కోవిడ్‌ సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్‌ చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్‌ విద్యార్థులను 4 నెలల కాలానికి ప్రాతిపదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు