థర్డ్‌ వేవ్‌ను తరిమేసేలా..!

13 Jun, 2021 02:17 IST|Sakshi

సీఎం ఆదేశాల మేరకు చిన్న పిల్లల వైద్యంపై కసరత్తు పూర్తి చేసిన యంత్రాంగం

బోధనాస్పత్రుల్లో 301 మంది పీడియాట్రిక్‌ స్పెషలిస్టులు

వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 227 మంది వైద్యులు

స్పెషల్‌ న్యూ బోర్న్‌ కేర్‌ యూనిట్స్‌లో 77 మంది వైద్యులు

ప్రభుత్వ పరిధిలో మొత్తం 598 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులు

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పీడియాట్రిక్‌ నిపుణులపై ఆరా

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌లో వైద్యపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 19 ఆర్టీపీసీఆర్‌ ల్యాబొరేటరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సర్కారు.. చిన్నారులకు అందించే వైద్యంపైనా కసరత్తు పూర్తి చేసింది. థర్డ్‌ వేవ్‌లో 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా సోకితే మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి, ఎంతమంది వైద్యులున్నారు, పడకలు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయాలపై సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పీడియాట్రిక్‌ ఐసీయూలు, ఆక్సిజన్‌ పడకలు సిద్ధం చేస్తోంది. రానున్న 3, 4 నెలల్లో అంచనాల మేరకు వైరస్‌ పరిస్థితులను అంచనా వేసి.. ప్రతి చిన్నారికీ వైద్యపరంగా ఉన్న ప్రతి వనరునూ ఉపయోగించేలా సిద్ధమైంది.

చిన్న పిల్లల వైద్యమే ముఖ్యం
రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌లో 4.50 లక్షల మంది చిన్నారులకు కరోనా సోకుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ స్థాయిలో కరోనా వేవ్‌ రావచ్చు.. రాకపోవచ్చు. కానీ.. గరిష్ట అంచనాలతో కార్యాచరణ చేపట్టింది. చిన్నారులకు కరోనా సోకితే ఏం చేయాలన్న దానిపై సర్కారు రెండు వారాలపాటు కసరత్తు చేసింది. రాష్ట్రం నలుమూలలా ఆస్పత్రులు, ప్రత్యేక పడకలు, డాక్టర్లు, నర్సులు వంటి వనరులను గుర్తించింది. వాటిలో చిన్నారులకు అవసరమయ్యే చికిత్సలకు అన్నిరకాల మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పడకలు, వైద్యులను గుర్తించారు. రెండు నెలల్లో కావాల్సిన వైద్య ఉపకరణాలన్నీ సమకూర్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

ఇలా చేస్తారు..
– రాష్ట్రంలో ఎక్కడైనా సరే 5 శాతానికి మించి పాజిటివిటీ లేకుండా చూడటం
– గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో పాజిటివిటీ శాతాన్ని బట్టి అన్‌లాక్‌ సడలింపులు 
– మాస్క్, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోడం వంటి జాగ్రత్తలపై నిఘా పెట్టడం
– జన సందోహ ప్రాంతాలను పూర్తిగా నియంత్రించి, నియంత్రణకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాలు ఉండేలా చూడటం
– ఒకరినొకరు తాకేలా ఉండే రద్దీ ప్రాంతాలను భారీగా తగ్గించడం
– అన్ని ప్రాంతాల్లో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడం
– ఫీవర్‌ సర్వే కొనసాగిస్తూ.. ముందే బాధితులను గుర్తించి వారికి వైద్యసేవలు అందించడం
– ఆటోలు, బస్సులు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రాంతాలు, కాలేజీలు, ఫార్మసీ ఔట్‌లెట్‌లు, వార్డు, గ్రామ సచివాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కరోనా నియంత్రణకు పోస్టర్లు
– కరోనా నియంత్రణకు ఎన్జీవోలను విరివిగా వినియోగించుకోవడం
– డిజిటిల్‌ మీడియా, పాపులర్‌ యాప్స్, ఇ–కామర్స్‌ కంపెనీలు, వాట్సాప్‌ల ద్వారా నియంత్రణపై ప్రచారం

 

మరిన్ని వార్తలు